న్యూఢిల్లీ: వివాహ మహోత్సవం జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకోవడం కోసం వధూవరులు ఎవరైనా ఉవ్విళ్లూరుతుంటారు. పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు వేదికపైకి రావడం దగ్గర నుంచి, రిసెప్షన్ ముగిసే వరకు ప్రతీది ప్రత్యేకంగా ఉండాలని ప్రతిఒక్కరూ కలగంటారు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పబోయే జంటకు కూడా ఒక కల ఉంది. పెండ్లి వేదికపైకి తమ ఎంట్రీనే అద్భుతంగా ఉండాలని ఆ జంట కలగన్నది. ఒకరకమైన జోష్‌తో బంధుమిత్రుల ముందు పెండ్లి వేదికపైకి రావాలని ప్లాన్ చేసుకుంది. ప్లాన్ ప్రకారమే బాగా ప్రాక్టీస్ కూడా చేసింది.
ఇక పెండ్లి ముహూర్తం రానే వచ్చింది. బంధుమిత్రలంతా వేడుకను వీక్షించేందుకు వచ్చి కూర్చున్నారు. ఇక వధూవరులు వేదిక మీదకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ముందు చేసుకున్న ప్లాన్ ప్రకారమే ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని లయబ్ధంగా డ్యాన్స్ చేస్తూ వేదికపైకి వచ్చారు. అనుకున్నట్లే వరుడు డ్యాన్స్ చేస్తూనే వధువును తన వీపుపై ఎక్కించుకున్నాడు. అలాగే వేదిక మొత్తం కలియతిరుగతూ బ్యాలన్స్ కోల్పోయాడు. దాంతో వధూవరులిద్దరూ స్టేజ్‌పై నుంచి కిందపడిపోయారు. పాపం వాళ్లు ఒకటి అనుకుంటే మరోటి జరిగింది.
అయితే, తమ ప్లాన్ బెడిసికొట్టినా, బంధుమిత్రులంతా ఘొల్లున నవ్వినా ఆ వధూవరులు ఏ మాత్రం సిగ్గుపడలేదు, నిరుత్సాహ పడలేదు. అదే జోష్‌తో లేచి మళ్లీ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఘటనను ఓ వ్యక్తి తన ఫోన్లో రికార్డు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది. లైకులు, కామెంట్ల వర్షం కురుస్తున్నది. దాదాపు 25 లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.