హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డి పాలనలో జర్నలిస్టులపై దాడులు, విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి ఒక మహిళా జర్నలిస్టు ఇంటికి మహిళా పోలీసులు లేకుండానే వెళ్లిన ఖాకీలు నానా హంగామా చేశారు. తలుపులు తట్టి భయభ్రాంతులకు గురిచేశారు. మరుసటిరోజు విచారణ పేరుతో గంటలు గంటలు సీసీఎస్ కార్యాలయంలో ఉంచి ఇబ్బందిపెట్టారు. ఆరునెలల చంటిబిడ్డకు కనీసం పాలుకూడా ఇవ్వనీయకుండా పోలీసులు కర్కశంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి అవినీతిని ప్రశ్నించినందుకు మన్నె క్రిశాంక్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఎమ్మార్ మీడియా పేరు కూడా జోడించారు. బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ప్రెస్‌మీట్ పెట్టి రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యుల రూ.50 వేల కోట్ల అక్రమ వ్యాపారాల గురించి చెప్పిన వార్తను కవర్ చేసినందుకు రేఖపై కేసు పెట్టారు.
మంగళవారం రాత్రి 11.30 గంటలకు మహిళా జర్నలిస్టు లేకుండానే ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులు బుధవారం విచారణకు హాజరుకావాలంటూ సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎం సురేందర్ పేరుతో నోటీసు ఇచ్చారు. అర్ధరాత్రి మహిళా జర్నలిస్టు ఇంటికి పోలీసులు.. అందులోనూ మగవారు వెళ్లి హంగామా చేయడం, ఆమె ఇద్దరు పిల్లలతో బిక్కుబిక్కుమంటూ లోపల ఉన్న సమయంలో తలుపులు గట్టిగా కొట్టడం, భయభ్రాంతులకు గురిచేయడం వివాదాస్పదమైంది. క్రిశాంక్‌ను అరెస్ట్ చేసినట్టుగానే ఆమెను కూడా అక్రమంగా అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో ఆమెకు నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. అర్ధరాత్రి వేళ 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వడానికి ఎందుకు వచ్చారని రేఖ అడిగితే ఫోన్ పనిచేయలేదని, అందుకే వచ్చామని చెప్పినట్టు తెలిసింది.
ఒక మహిళ ఇంటికి మహిళా కానిస్టేబుల్ లేకుండా వెళ్లడం, అర్ధరాత్రి సమయంలో తలుపులు కొట్టి భయభ్రాంతులకు గురిచేయడం మానవహక్కుల ఉల్లంఘనేనని న్యాయవాదులు అంటున్నారు. మరుసటిరోజు ఉదయం తనకు ఆరోగ్యం బాగాలేదని, వారం తర్వాత విచారణకు వస్తానని సీసీఎస్ పోలీసులకు రేఖ విజ్ఞప్తి చేసినప్పటికీ వినకుండా తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని, కచ్చితంగా విచారణకు రావాలని చెప్పారు. దీంతో ఆమె ఉదయం 11.30 గంటలకు తన ఆరు నెలల పసిపాపను తీసుకుని వెళ్లారు. పోలీసులు సీసీఎస్ కార్యాలయంలో సుమారు ఏడుగంటలపాటు పోలీసులు ఆమెను విచారించారు. ఒక గదిలో ఆమెను, మరొక గదిలో పసిపాపను ఉంచి విచారించడం విమర్శలకు తావిస్తున్నది. ఆ సమయంలో పాప ఏడుస్తుండడం చూసి ఇంతలా చేయాలా అంటూ కొందరు పోలీసులే చర్చించుకున్నట్టు తెలిసింది.
రేఖను సీసీఎస్‌లో విచారిస్తున్న విషయం తెలుసుకున్న న్యాయవాదులు జక్కుల లక్ష్మణ్, శ్రీకాంత్, సాయి, కళ్యాణ్ తదితరులు వెళ్లి పోలీసులతో మాట్లాడడంతో రాత్రి 8 గంటలకు పంపించారు. ఒక మహిళా జర్నలిస్టును విచారణ పేరుతో ఏడుగంటల పాటు సీసీఎస్‌లోనే ఉంచి ప్రశ్నల మీద ప్రశ్నలు, అదీ వ్యక్తిగత సమాచారం గురంచి ప్రశ్నించడంతో ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. విచారణ జరుగుతున్న సమయంలోనే ఆమె ఫోన్ ఇవ్వాలని పోలీసులు అడిగారు. ఆమె నిరాకరించడంతో రిమాండ్ చేస్తామని బెదిరించడంతో న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇదే కేసులో క్రిశాంక్‌కు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతోపాటు గతంలో కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను జక్కుల లక్ష్మణ్ విచారణాధికారికి తెలిపారు. సూర్యాస్తమయం తర్వాత కూడా జర్నలిస్టు రేఖను సీసీఎస్‌లోనే చంటిపిల్లతో సహా ఉంచడంపై బీఆర్ఎస్ నేత కొణతం దిలీప్ మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా అంటూ ప్రశ్నించారు.