హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న జనగణనలో కులగణనను సమగ్రంగా, పారదర్శకంగా, కచ్చితమైన గణాంకాలతో నిర్వహించాలని మాజీ మంత్రి, ఆల్ ఇండియా ఓబీసీ ప్రజాప్రతినిధుల ఫోరమ్ అధ్యక్షుడు వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ జాతీయ జనరల్సెక్రటరీ రాజేంద్రచౌదరి, కౌన్సిల్ ప్రతిపక్ష నేత జస్మీర్ అన్సారీని సోమవారం కలిసి కులగణనపై పార్టీ మద్దతు ఇవ్వాలని కోరారు.
అనంతరం సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేశ్ యాదవ్‌కు శ్రీనివాస్‌గౌడ్ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ అంశంపై రాష్ట్రపతికి లేఖ రాసి కులగణన పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. 2027 కులగణనలో ప్రతి వర్గానికీ సంబంధించి కచ్చితమైన సమాచారం నమోదయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని అన్నారు.