హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : ‘క్యాంపస్ టు కెరీర్’ ప్రోగ్రామ్లో భాగంగా 20 విద్యాసంస్థలతో ‘వీ-హబ్’ ఒప్పందం చేసుకున్నట్టు సంస్థ సీఈవో సీతా పల్లచోళ్ల తెలిపారు. బుధవారం వీ-హబ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘క్యాంపస్ టు కెరీర్’లో భాగంగా యువ మహిళలు కేవలం చదువుకే పరిమితం కాకుండా నైపుణ్యాలతో సాధికరత సాధించేలా తీర్చిదిద్దనున్నట్టు పేర్కొన్నారు. మహిళలను శ్రామిక శక్తికి నాయకత్వం వహించేలా సంసిద్ధం చేస్తామని స్పష్టంచేశారు. హైదరాబాద్, రంగారెడ్డిలో ఉన్న యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్, మహిళా కళాశాలల భాగస్వామ్యంతో వీ-హబ్ సేవలను మరింత విస్తరించనున్నట్టు వెల్లడించారు. ఈ ఒప్పందాలతో పారిశ్రామిక రంగానికి నైపుణ్యాలు ఉన్న యువ మహిళలను అందించవచ్చని తెలిపారు.