ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 17:31:13

టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలువాయిదా

టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలువాయిదా

హైదరాబాద్:  తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర మహాసభలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆ సంఘ నాయకులు ప్రకటించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, టెంజు అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్ లతో పాటు హైదరాబాద్ అధ్యక్ష కార్యదర్శులు యోగానంద్, నవీన్ కుమార్ లు  ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 8 ఆదివారం ఎన్టీఆర్ స్టేడియంలో తలపెట్టిన యూనియన్ రాష్ట్ర మహాసభలను కరోనా వైరస్ ఆందోళన నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా పరేషాన్ చేస్తున్న కరోన వైరస్ గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా హైదరాబాద్ కు సైతం వ్యాపించడంతో ఇక్కడ కొంత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తోపాటు పోలీస్ అధికారులు, హైకోర్టు సూచనలు, లాంటి విషయాలను పరిగణలోకి తీసుకోవడమే కాకుండా జర్నలిస్టు లుగా ఈ సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఈ నిర్ణయం తీసుకోక తప్పని అనివార్య స్థితి అని వివరించారు. ప్రస్తుతం ఉన్న వాతావరణం కొంత తేలిక పడగానే వీలైనంత త్వరగా కుదిరితే మార్చి నెలాఖరులోగా మహా సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.  అప్పటివరకు జిల్లాల బాధ్యులు మన సంఘ కార్యకలాపాల విషయంలో అదే ఊపును కొనసాగించాలని, ప్రధానంగా ఆన్ లైన్ సభ్యత్వం నూటికి నూరుశాతం మీ మీ జిల్లాల్లో ఈ లోపు పూర్తి చేసుకునే విషయమై ప్రత్యేక చొరవ చూపాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు 8 మార్చి న రాష్ట్ర కమిటీ కార్యవర్గం సమావేశం అవుతున్నట్లు వెల్లడించారు.


logo