TS POLYCET | తెలంగాణలో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో (పాలిటెక్నిక్) ప్రవేశాలకు సంబంధించి పాలిసెట్ కౌన్సెలింగ్ ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే. తొలి విడతకు సంబంధించిన పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్లను ఆదివారం సాంకేతిక విద్యాశాఖ ఆదివారం కేటాయించింది. తెలంగాణవ్యాప్తంగా 116 కళాశాలల్లో 21,367 సీట్లు భర్తీ అయ్యాయి. 56 ప్రభుత్వ సంస్థల్లో 13,321 సీట్లకు గాను.. 11,648 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 1,673 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
అలాగే 60 ప్రైవేటు విద్యా సంస్థల్లో 16,075 సీట్లకు గాను 9,719 సీట్లు భర్తీ కాగా.. ఇంకా 6,356 సీట్లు భర్తీ కావాల్సి ఉంది. మొత్తం తొలి విడుతలో 8,029 పాలిటెక్నిక్ సీట్లు భర్తీ కావాల్సి ఉంది. అయితే, పాలిటెక్నికల్ చాలా మంది విద్యార్థులు కంప్యూటర్ కోర్సుల వైపే మొగ్గు చూపారు. ఇక సీట్ల అలాట్మెంట్ జరిగిన విద్యార్థులు ఈ నెల 29 వరకు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వాకాటి కరుణ సూచించారు. జులై ఒకటి నుంచి తుది విడుత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.