TS Cabinet Meeting | ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఆయా ఇండ్ల నిర్మాణానికి మరోసారి గడువును పొడిగించింది. కటాప్ డేట్ నెల రోజుల పాటు రిలాక్సేషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి హరీశ్‌రావు మీడియాకు వివరించారు. ‘కేబినెట్లో పేదలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నాం. జీవో 58,59 కింద కొద్ది మంది మిగిలిపోయిన వారు మేం గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయాం, కటాఫ్ తేదీ నుంచి ఉపశమనం కల్పించాలని, పేదలకు అందరికీ ఇండ్లపై హక్కులు కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా విజ్ఞప్తులు వచ్చాయి.
వాటిని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ఎంతో ప్రేమతో.. వారందరికీ చివరిసారిగా అవకాశం ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. జీవో 58 కింద ఒక్క రూపాయి లేకుండా పేదలందరికీ ఇండ్లపై హక్కులు కల్పిస్తున్నాం. గత కాంగ్రెస్, తెలుగు దేశం ప్రభుత్వాలు ఉన్న సమయంలో జేసీబీలు, ప్రొక్లయిన్లతో కూలగొట్టే ప్రయత్నం చేయడం.. పేదలు భయం నీడలో బ్రతికేటట్టు చేసిన పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి. కానీ, అలాంటి పేదలను గుండెలకు హత్తుకొని ఇవాళ వారికి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది. జీవో 58 కింద 1,45,668 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా కొందరు పేదలు మిగిలిపోయారని, కటాఫ్ తేదీ నుంచి ఉపశమనం కల్పించాలని, అందరికీ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తులు వచ్చాయి.
వాటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చివరిసారిగా.. నెల రోజులపాటు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చారు. దరఖాస్తులను పరిశీలించి, అర్హులందరికీ హక్కులు కల్పించాలని కేబినెట్లో నిర్ణయించాం. అలాగే 59 జీవోకు సంబంధించి అవే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 59జీవో కింద 42వేలమంది లబ్ధిపొందారు. కటాఫ్ తేదీ గతంలో 2014లో తేదీ ఉండేది, దాన్ని 2020కి పెంచాం. ఆ లోపు ఎవరైనా ఇండ్లు కట్టుకుంటే వారందరికీ 58, 59 జీవో కింద వారికి హక్కులు కల్పించి, పేదల జీవితాల్లో ఉత్సాహం, ఆనందం నింపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది గత ప్రభుత్వాలు, మా ప్రభుత్వానికి ఉన్న తేడా. గతంలో ఉన్న ప్రభుత్వాలు కూల్చడంతో పాటు ఉసురుపోసుకునే వారు. పేదల దగ్గర రాజకీయ నాయకులు, గల్లీ లీడర్లు ఇబ్బందులు పెట్టే పరిస్థితులుండేవి. కానీ, ఇప్పుడు ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే పట్టాలను వారి ఇండ్లకు వెళ్లి ఉచితంగా ఇస్తున్నాం’ అని హరీశ్‌రావు వివరించారు.