సన్నధాన్యం తన్నుకుపోతున్నరు
తెలంగాణలో పండిన సన్న ధాన్యాన్ని ఇతర రాష్ర్టాల బ్రోకర్లు తన్నుకుపోతున్నారు. పంట కోతకు రాగానే గద్దల్లా పొలాల వద్ద వాలిపోతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ర్టాల వ్యాపారులు మన రైతులకు ముందస్తుగా అడ్వాన్సులు చెల్లిస్తూ పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈ కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. దీన్ని అడ్డుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమవుతున్నది.
- పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
- ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న సన్న బియ్యం ధరలు
- నెల రోజుల్లోనే 25% నుంచి 35% వరకు పెరుగుదల
- వచ్చే 2 నెలల్లో మరింత భారీగా పెరిగే అవకాశం
- నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కడపత్రి ప్రకాశ్‌రావు, కరీంనగర్ ప్రతినిధి, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జమ్మికుంట: తెలంగాణలో పండిన సన్న ధాన్యాన్ని ఇతర రాష్ర్టాల బ్రోకర్లు తన్నుకుపోతున్నారు. పంట కోతకు రాగానే గద్దల్లా పొలాల వద్ద వాలిపోతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ర్టాల వ్యాపారులు మన రైతులకు ముందస్తుగా అడ్వాన్సులు చెల్లిస్తూ పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈ కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. దీన్ని అడ్డుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమవుతున్నది.
ఫలితంగా ఇప్పటికే ఆకాశాన్ని అంటిన సన్నబియ్యం ధరలు వచ్చే 2-3 నెలల్లో మరో 30% మేరకు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. ప్రస్తుత యాసంగిలో పండిన సన్నధాన్యం కొనుగోలుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ నినో ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉన్నదని ఇప్పటికే అనేక నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టుకోవాలని, పండిన ప్రతి ధాన్యం గింజనూ జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది.
నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడంలో ఘోరంగా విఫలమవడంతో మేడిగడ్డ నుంచి గత మూడున్నరేండ్లలో 734 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. ఇప్పుడు తెలంగాణ రైతులు పండించిన సన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడంలోనూ రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. మన రాష్ట్రంలో పండే బీపీటీ, తెలంగాణ సోనా, హెచ్ఎంటీ, జైశ్రీరామ్ తదితర సన్న రకాలకు పొరుగు రాష్ర్టాల్లోని ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాలతోపాటు విదేశాల్లోనూ భారీ డిమాండ్ ఉన్నది.
మన రాష్ట్రంలోనూ ఎక్కువ మంది ప్రజలు సన్నబియ్యమే తింటున్నారు. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటాయి. గత నెల రోజుల్లోనే 25 నుంచి 35% మేరకు పెరిగాయి. నెల క్రితం క్వింటాల్ రూ.6,800గా ఉన్న జైశ్రీరామ్ పాత బియ్యం ధర ఇప్పుడు రూ.8,500కు పెరిగింది. అలాగే సాంబ మసూరి ధర రూ.4,600 నుంచి రూ.6,800కు, హెచ్ఎంటీ బియ్యం ధర రూ.5,800 నుంచి రూ.7 వేలకు, ఆర్ఎన్ఆర్ (స్టీమ్డ్) ధర రూ.5,800 నుంచి రూ.7,200కు చేరింది. వచ్చే 2-3 నెలల్లో ఈ ధరలు మరో 25 నుంచి 30 శాతం మేరకు పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు చెప్తున్నారు.
వ్యాపారుల మధ్య పోటీ
ప్రస్తుతం రాష్ట్రంలో క్వింటాల్ గ్రేడ్-ఏ రకం ధాన్యానికి మద్దతు ధర రూ.2,461గా, సాధారణ రకం ధాన్యానికి రూ.2,441గా ఉన్నది. బీపీటీ, ఆర్ఎన్ఆర్, కేఎన్ఎం, జైశ్రీరామ్, హెచ్ఎంటీ, సోనా, డబ్ల్యూజీఎల్ సన్న రకాలను సాగుచేసిన రైతులకు బోనస్ కింద క్వింటాల్‌కు రూ.500 చొప్పున ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ, ఇతర రాష్ర్టాల్లో ధాన్యం దిగుబడులు తగ్గడంతో మన సన్న ధాన్యం ధరలు భారీగా పెరిగాయి.
మూడు రోజుల క్రితం వరకు క్వింటాల్‌కు రూ.3,800 చెల్లించిన వ్యాపారులు.. ఇప్పుడు ఆ ధరలను రూ.4 వేల నుంచి రూ.4,200 వరకు పెంచారు. దీంతో మున్ముందు తెలంగాణలో సన్న బియ్యం కొరత ఏర్పడవచ్చని, సామాన్య ప్రజలకు అవి అందుబాటులో ఉండకపోచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తం కావాలని, అందుబాటులో ఉన్న సన్నధాన్యం, బియ్యం నిల్వలపై సమగ్ర సమీక్ష నిర్వహించడంతోపాటు రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు సరిపడా నిల్వలు ఉండేలా ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

