హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల 2025 జనవరి నెల కోటా టికెట్లను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నది. ఈ నెల 21న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఈ టికెట్లు పొందిన వారు 21 నుంచి 23న మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లకీడిప్లో టికెట్లు మంజూరవుతాయని తెలిపారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల, వాటి దర్శన స్లాట్ల జనవరి నెల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. జనవరి నెలలో అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల జనవరి నెల ఆన్లైన్ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలిపారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జనవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
జనవరి నెలలో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలలో జనవరి నెల గదుల కోటాను ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తులు https// ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని తెలిపారు. శ్రీవారి ఆలయంలో గురువారం పౌర్ణమి గరుడసేవ జరుగనున్నది.