హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): లాసెట్, ఈసెట్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు శుక్రవారం విడుదల చేయనున్నారు. ఇదేరోజు జరిగే ఆయా సెట్ల సమావేశాల్లో సమగ్రంగా చర్చించి షెడ్యూల్స్‌ను విడుదల చేస్తారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ లాసెట్, పీజీలాసెట్ నోటిఫికేషన్ ఈ నెలాఖరులో విడుదల కానున్నది.
ఈ నెల 27 లేదా 28 తేదీల్లో నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. మార్చి మొదటి వారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ మేరకు లా, పీజీలాసెట్ షెడ్యూల్ శుక్రవారం విడుదల కానున్నది. దీంతోపాటు బీటెక్ కోర్సుల్లో ల్యాట్రల్ ఎంట్రీ కోసం నిర్వహించే టీఎస్ ఈసెట్ షెడ్యూల్ సైతం ఇదేరోజు విడుదలకానున్నది. ఈనెల 10న టీఎస్ ఐసెట్, ఎడ్‌సెట్‌ల సమావేశాల అనంతరం ఆ రెండింటి షెడ్యూల్స్నూ అధికారులు విడుదల చేయనున్నారు.