హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): హకుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేయడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ తీవ్రం గా ఖండించారు. తీస్తా సెతల్వాద్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. గుజరాత్లో 22 ఏండ్ల్ల క్రితం నాటి మత ఘర్షణలు, అల్లర్ల విషయంలో సుదీర్ఘ పోరాటం చేసిన ఆమెపై సుప్రీంకోర్టు పరిధి దాటి వ్యాఖ్యలు చేసినట్టు తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ అల్లర్ల విషయంలో సాగిన న్యాయపోరాటంలో ఆమె నిరాధారమైన ఆరోపణలు చేశారన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్టు తెలిపారు. న్యాయస్థానం వ్యాఖ్యలను అవకాశంగా తీసుకొన్న పోలీసులు ఒకరోజు కూడా గడవకముందే ఆమెను అన్యాయంగా అరెస్టు చేశారని వాపోయారు. కోతికి కొబ్బరిచిప్ప దొరికిన చందంగా పోలీసులు వ్యవహరించారని మండిపడ్డారు. అల్లర్లకు అసలు కారకులు ఎవరో ప్రపంచానికి తెలుసునని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం వీడియోను విడుదల చేశారు.