వరంగల్, అక్టోబర్ 7 : వరంగల్ నగరంలోని చెరబండరాజు పేదల కాలనీపై నాలుగు నెలలుగా సర్కార్ జులుం కొనసాగిస్తున్నది. నాలుగు దశాబ్దాలుగా అక్కడే నివాసం ఉంటున్న వారి ఇండ్లను కూల్చివేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నది. కన్నీళ్లు పెట్టుకుని వేడుకున్నా కనికరించని పోలీసులు అడ్డుకున్న పేదలను అరెస్ట్ చేశారు. భద్రకాళీ ఆలయ సమీపంలోని చెరబండరాజు కాలనీలో ఆలయ అభివృద్ధి పేరుతో గుడిసెవాసులను బలవంతంగా తరలిస్తున్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో కాంగ్రెస్ నాయకులు కాలనీలోని ఇండ్లను కూల్చివేశారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ‘కుడా’ అధికారులు, పోలీసులు బుల్డోజర్లతోవచ్చి కాలనీలో హల్చల్ చేశారు. బాధితులు పోలీసులు, అధికారులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఆలయ అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని కాకతీయ పట్టణాభివృద్ది సంస్థ (కుడా) ఏపీవో శంకర్ ఫిర్యాదు మేరకు జన్ను ప్రవీణ్, రాపాక సునిల్, గన్నారపు సుమలత, బస్కుల కుమార్, రడపాక బాబు, మాచర్ల దుర్గాప్రసాద్, జన్ను అనిత, లింగాల అన్నపూర్ణతో పాటు పలువురు కాలనీవాసులపై పోలీసులు కేసు నమోదుచేసి, విచారణ జరుపుతున్నట్టు సీఐ కరుణాకర్ తెలిపారు.

చెరబండరాజు కాలనీవాసులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయభాస్కర్‌ను పోలీసులు అడ్డుకుని వడ్డేపల్లిలోని అయన ఇంటికి తరలించి హౌస్అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. వరంగల్‌లో హైడ్రా తరహా అపరేషన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూల్చుడా? అని ప్రశ్నించారు. కాలనీవాసుల ఇండ్లను కూల్చొద్దని హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్, మానవ హక్కుల కమిషన్ పేదల పక్షాన ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చివేస్తున్నదని వెల్లడించారు.
కాలనీవాసులకు న్యాయం చేసిన తర్వాతనే భూ సేకరణ చేపట్టాలని స్పష్టంచేశారు. కాలనీవాసులు కొందరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారని తెలిపారు. బాధితులను అరెస్ట్ చేసి మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. బాధితుల తరపున న్యాయస్థానాలు, ప్రజాక్షేత్రంలో పోరాడుతామని స్పష్టంచేశారు. భద్రకాళీ ఆలయ నిర్మాణానికి రూ.30 కోట్ల నిధులు నిధులు మంజూరు చేసింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టంచేశారు. ఆలయ మాఢవీధుల నిర్మాణం చర్చల దశలోనే కాలనీవాసులకు హకులు దకిన తర్వాతే స్థల సేకరణ చేయాలని ఆనాటి అధికారులకు సూచించానని పేర్కొన్నారు. అభివృద్ధికి సహకరిస్తామని.. పేదలకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.