అనుకున్నట్టే కట్టబెట్టారు.. ప్రభుత్వ సంస్థకు ఎగ్గొట్టి ప్రైవేట్‌కు అప్పగింత
ఏ ప్రభుత్వమైనా సరే ప్రభుత్వరంగ సంస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఇదేం విచిత్రమోగానీ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మాత్రం ప్రభుత్వ సంస్థను పాతర పెట్టి.. ప్రైవేట్ సంస్థకు వంతపాడుతున్నది.
- నారాయణపేట జిల్లాను ఆయిల్‌ఫెడ్ నుంచి తప్పించి ఎకోపామ్కు కేటాయింపు
- సీఎం కోసం వ్యవసాయ శాఖ తప్పటడుగు
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఏ ప్రభుత్వమైనా సరే ప్రభుత్వరంగ సంస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఇదేం విచిత్రమోగానీ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మాత్రం ప్రభుత్వ సంస్థను పాతర పెట్టి.. ప్రైవేట్ సంస్థకు వంతపాడుతున్నది. ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ఫెడ్‌కు అప్పగించిన జిల్లాను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టింది. ప్రస్తుతం ఆయిల్‌ఫెడ్ ఆధీనంలో ఉన్న నారాయణపేట్ జిల్లాను ప్రైవేట్ కంపెనీ ఎకోపామ్ ఆయిల్ కంపెనీకి కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ రెండురోజుల క్రితం అంతర్గత ఉత్తర్వులు జారీచేశారు. ఇంతకుముందు ఆయిల్‌పామ్ సాగు కోసం నారాయణపేట జిల్లాను ప్రభుత్వం ఆయిల్‌ఫెడ్‌కు కేటాయించింది.
దీంతో ఆ సంస్థ నాలుగైదేండ్ల పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొని అక్కడ రైతులను ప్రోత్సహిస్తూ ఆయిల్‌పామ్ సాగును చేపట్టింది. భారీ పెట్టుబడితో ఇప్పటికే సుమారు ఏడు వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగయ్యేలా కృషిచేసింది. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు ఆయిల్‌ఫెడ్ సంస్థ అభివృద్ధి చేసిన జిల్లాను ఇప్పుడు ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఇందుకు కారణం సీఎం రేవంత్‌రెడ్డి కోరిక తీర్చేందుకేననే విమర్శలు వస్తున్నాయి. గతంలో సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి తన జిల్లాలోనూ ఇలాంటి అద్భుతమైన ఫ్యాక్టరీ నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
అయితే కొడంగల్ నియోజకవర్గ పరిధి వికారాబాద్ జిల్లా ఎకోపామ్ ఆయిల్ కంపెనీ పరిధిలో ఉంది. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే స్థాయిలో సదరు కంపెనీ ఆయిల్‌పామ్ సాగును చేపట్టలేకపోయింది. దీంతో ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన సాగు విస్తీర్ణం కోసం నారాయణపేట జిల్లాలోని నాలుగు మండలాలను ఎకోపామ్కు కేటాయించాలని తొలుత భావించారు. ఆ తర్వాత మొత్తం నారాయణపేట జిల్లానే ఆ సంస్థకు కట్టబెట్టాలని నిర్ణయించారు. ఆ మేరకు నారాయణపేట జిల్లాను ఆయిల్‌ఫెడ్ నుంచి తీసివేసి ప్రైవేట్ కంపెనీ ఎకోపామ్ ఆయిల్ కంపెనీకి కేటాయించారు.
ముందే నిర్ణయం.. ఆ తర్వాత నాటకం
ఎకోపామ్ ఆయిల్ కంపెనీకి నారాయణపేట జిల్లాను కేటాయించాలని ముందుగానే నిర్ణయించారు. ఏకపక్షంగా కేటాయిస్తే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో టెండర్ డ్రామాను రక్తికట్టించారనే విమర్శలున్నాయి. వ్యవసాయశాఖ జారీచేసిన ఉత్తర్వులు పరిశీలిస్తే నవ్విపోదురు గాకా నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉందనే విమర్శలున్నాయి. నారాయణపేట జిల్లా కేటాయింపు కోసం ఉద్యానశాఖ టెండర్ పిలువగా నాలుగు కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో ఎకోపామ్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ కంపెనీ, లోహియా ఈడబుల్ ఆయిల్ ప్రైవేట్ కంపెనీ, పతంజలి ఫుడ్స్, అజంతా సోయా లిమిటెడ్ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అయితే ఆ నాలుగింటిలో అర్హత కలిగిన కంపెనీని ఎంపిక చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏం పరిశీలించిందో, ఏ ప్రాతిపదకన తీసుకున్నదో తెలియదు గానీ ఎకోపామ్ కంపెనీని రికమెండ్ చేసినట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది. కమిటీ సిఫారసు మేరకు నారాయణపేట జిల్లాను ఎకోపామ్ ఆయిల్ కంపెనీకి కేటాయించినట్టు పేర్కొన్నది. మిగిలిన మూడు కంపెనీలు కూడా అన్ని విధాలుగా అర్హత ఉన్నవేనని, కానీ ఎకోపామ్కు కేటాయించేందుకు కమిటీ పేరిట నాటకం ఆడారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆయిల్‌ఫెడ్‌కు నష్టం… ఎకోపామ్కు లాభం
సీఎం కోరిక నెరవేర్చేందుకు వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ తీసుకున్న నిర్ణయం ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ఫెడ్‌కు తీవ్ర ఆర్థిక నష్టం కలిగిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అక్కడ ఏడు వేల ఎకరాల ఆయిల్‌పామ్ సాగు కోసం కోట్ల రూపాయలు వెచ్చింది. దీనికితోడు 20 ఏండ్లపాటు ఆ జిల్లా నుంచి ఆయిల్‌పామ్ గెలల ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నది. ఇలా ఆయిల్‌ఫెడ్ వందల కోట్ల రూపాయలు నష్టపోతుండగా ఆ నష్టాన్ని ఎకోపామ్ కంపెనీకి లాభాల రూపంలో వెళ్తాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సీఎం కోరిక తీర్చాలనుకుంటే ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ఫెడ్‌ను ముందు పెట్టి కంపెనీ ఏర్పాటు చేయిస్తే అన్ని విధాల మేలు జరిగేదని, అక్కడ రైతులకు సైతం ధైర్యం ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా చేయకుండా ఆయిల్‌ఫెడ్‌ను పక్కకు నెట్టి ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం ఏ విధానమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

