ఠంచనుగా నిధులు

- గ్రామాలు, పట్టణాలకు ప్రతినెలా 381.17 కోట్లు
- ఈ ఏడాది ఇప్పటివరకు 2,487 కోట్లు చెల్లింపు
- కేటాయింపులకు అదనంగా 200 కోట్లు ఇచ్చాం
- ఫ్రీజింగ్ లేదు.. నిరంతరాయంగా నిధుల విడుదల
- అనారోగ్యంతోనే సోమవరంపేట సర్పంచ్ ఆత్మహత్య
- నిధుల విడుదలపై రాష్ట్ర ఆర్థికశాఖ వివరణ
ప్రతినెల విడుదల చేస్తున్న నిధులు..
పల్లె ప్రగతి రూ. 269.17కోట్లు
పట్టణ ప్రగతి రూ. 112.00కోట్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): గ్రామాలు, పట్టణాలకు నిధుల కేటాయింపులు, బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేదని ఆర్థికశాఖ తెలిపింది. బిల్లుల చెల్లింపుపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని స్పష్టంచేసింది. గ్రామాలు, పట్టణాలకు ప్రతినెలా క్రమం తప్పకుండా రూ.381 కోట్లు విడుదల చేస్తున్నామని శుక్రవారం వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.2,487 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వస్తున్న ఆరోపణలకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వివరణ ఇచ్చారు. కరోనావల్ల గత ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రం ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం కలుగకుండా చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పథకం నిధులను ఇతర పథకాలకు మళ్లించారని, ఆర్థిక సంఘం నిధులను ఫ్రీజ్ చేశారని, పలు పనులకు సంబంధించిన బిల్లులను పెండింగ్‌లో ఉంచటంవల్లనే ఓ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారని వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.
ఇదీ అసలు చిత్రం..
- ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 23వ తేదీ నాటికి పట్టణాలు, గ్రామాలకు కలిపి రూ.2,487 కోట్లు చెల్లించారు. నెలవారీ కేటాయింపులకు అదనంగా రూ.200 కోట్లు జమచేశారు. ఇంకా కేవలం రూ.431 కోట్లు మాత్రమే ఈ-కుబేర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో పల్లె ప్రగతి కింద రూ.279 కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.152 కోట్లు చెల్లించాల్సి ఉన్నది.
- పట్టణ ప్రగతిలో భాగంగా జీహెచ్ఎంసీ మినహా 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.1,241.72 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో రూ.1,152.03 కోట్ల చెల్లింపులు జరిగాయి. రూ.89.69 కోట్ల బిల్లులు మాత్రమే వివిధ దశల్లో ఉన్నాయి.
- జీహెచ్ఎంసీకి పట్టణ ప్రగతి కింద గతేడాది రూ.377.42 కోట్లు, ఈ ఏడాది రూ.185.87 కోట్లు ప్రభుత్వం బదిలీచేసింది. మొత్తంగా రూ.563.29 కోట్లు విడుదలయ్యాయి.
- ఉపాధి హామీ కింద గత ఆర్థిక సంవత్సరం కేంద్రం నుంచి రూ.1,487 కోట్లు వచ్చాయి. దీనికి రాష్ట్రవాటా కింద రూ.1,929 కోట్లు విడుదల చేసి, చెల్లింపులు కూడా పూర్తిచేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.1,432 కోట్లు విడుదలచేయగా, రూ.1,002.50 కోట్ల చెల్లింపులు జరిగాయి.
- ఉపాధిహామీ పథకం ద్వారా మెటీరియల్ కాంపోనెంట్ కోసం గతేడాది రూ.1,751 కోట్లు చెల్లించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.927 కోట్లు ఇచ్చారు.
- ఆర్థిక సంఘం నిధులతోపాటు వందశాతం మ్యాచింగ్ గ్రాంట్‌కు అదనంగా రూ.500 కోట్లు విడుదల చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఈ ఏడాది ఆర్థికసంఘం నుంచి రూ.733 కోట్లు మాత్రమే వచ్చాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏకంగా రూ.2,487 కోట్లు చెల్లించింది.
వివిధ ఘటనలపై ఆర్థికశాఖ వివరణ
సోమవరం పేట
ప్రచారం: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమవరంపేట సర్పంచ్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం లక్షల రూపాలయ ఖర్చుచేశారు. బిల్లులు రాకపోవటంతో ఆత్మహత్య చేసుకున్నారు.
వాస్తవం: సోమవరంపేట పంచాయతీకి ఈ నెలలో సమర్పించిన రూ.53,038 విలువైన 2 బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. పంచాయతీకి గత ఐదేండ్లలో ప్రభుత్వం రూ.61.56 లక్షలు మంజూరుచేసింది. ఈ ఏడాదే రూ.8.66 లక్షల చెల్లింపులు జరిగాయి. సోమవరంపేట సర్పంచ్ కిడ్నీ వ్యాధి, ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నారని ఈ ఏడాది మేలో రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ అధికారి నివేదిక ఇచ్చారు. బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్నారని అనటం అవాస్తవం.
మర్కూక్ మండలం
ప్రచారం: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో చాలా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
వాస్తవం: మండలానికి సంబంధించి ఇటీవల సమర్పించిన రూ.2.67 లక్షల చెల్లింపులు మాత్రమే ప్రాసెస్‌లో ఉన్నాయి. పెండింగ్ బిల్లులే లేవు. మండలానికి గత ఆర్థిక సంవత్సరంలో రూ.3.76 కోట్లు విడుదలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.1.61 కోట్లు చెల్లింపులు జరిగాయి.
నల్లగొండ జిల్లాకు..
ప్రచారం: నల్లగొండ జిల్లాకు తగినన్ని నిధులు కేటాయించడం లేదు.
వాస్తవం: జిల్లాకు పల్లె ప్రగతి కింద గత ఆర్థిక సంవత్సరంలో రూ.228.43 కోట్లు విడుదల చేసి చెల్లింపులు జరిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని స్థానిక సంస్థలకు రూ.83.16 కోట్లు విడుదలయ్యాయి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

