ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం?
రూ.10 వేల కోట్లకు పైనే పేరుకుపోయిన బకాయిలు.. రూ.2వేల కోట్లకు ‘రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు’.. ఆస్తులు అమ్ముతున్నట్టు చెప్పిన రవాణా మంత్రి పొన్నం
- మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
- తీవ్ర అభ్యంతరం తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులు
ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేసినవారికి రావాల్సిన బకాయిలను త్వరగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురోకుండా, వారికి రావాల్సిన ప్రయోజనాలు అందించాల్సిన బాధ్యత సర్కార్పై ఉన్నది. అవసరమైతే సంస్థకు చెందిన విలువైన భూములను విక్రయించైనా రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తం.. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లిన..
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఆర్టీసీ ఆస్తుల అమ్మకానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్మెంట్లు, ఇతర రాయితీలు, బకాయిలు వేల కోట్ల రూపాయల మేర పేరుకుపోవడంతో.. వాటిని చెల్లించలేక, ఆస్తులను అమ్మే దిశగా అడుగులు వేస్తున్నట్టు కార్మికులు భావిస్తున్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం తనను కలిసిన ఆర్టీసీ గుర్తింపు సంఘం నాయకులతో చేసిన వ్యాఖ్యలు తమ అనుమానాలను బలపరుస్తున్నాయని అంటున్నారు.
‘ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను త్వరితగతిన చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఉద్యోగులు ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక ఇబ్బందులు ఎదురోకుండా, వారికి రావాల్సిన ప్రయోజనాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
అవసరమైతే సంస్థకు చెందిన విలువైన భూములను విక్రయించైనా రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను తీర్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లా’ అని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలకు కొత్తగా గెలిచిన ఆర్టీసీ గుర్తింపు సంఘాల నేతలు చప్పట్లు కొట్టారు. మంత్రి వ్యాఖ్యలను ఖండించాల్సిన నాయకులే.. ఆస్తుల అమ్మకానికి వంతపాడినట్లు అయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. దీంతో ఆర్టీసీ ఆస్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎసరు పెట్టిందని ఆందోళన చెందుతున్నారు.
‘రిటైర్డ్’ ఉద్యోగుల బకాయిలు 2000 కోట్లు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కొన్నేండ్లపాటు సేవలు అందించి రిటైర్ అయిన ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని కార్మికులు చెప్తున్నారు. కనీసం పెన్షన్ సౌకర్యం కూడా లేకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్నారు. 2017, 2021 వేతన సవరణ (పీఆర్సీ) ఎరియర్స్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్, చివరి నెల జీతం వంటి అన్ని బకాయిలు కలిపి యాజమాన్యం సుమారు రూ.2,000 కోట్లు చెల్లించాల్సి ఉంది.
ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగులకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ, తమకు రావాల్సిన బకాయిలను పూర్తిగా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు అందక, అప్పులు తీర్చలేక, పిల్లల పెండ్లిళ్లు చేయలేక ఇప్పటికే 300 మందికి పైగా విశ్రాంత ఉద్యోగులు కన్నుమూశారని తోటి రిటైర్డ్ ఉద్యోగులు చెప్తున్నారు. వారి కుటుంబాలకు కూడా ఇప్పటివరకు ఒక రూపాయి చెల్లించలేదని వారు వాపోతున్నారు. అయితే, వీటిని క్రమం తప్పకుండా చెల్లించాల్సిన ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుండటంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.
ఆర్టీసీకి ప్రభుత్వ బాకీ రూ.3,785 కోట్లు!
తెలంగాణ ఆర్టీసీకి కేవలం మహాలక్ష్మి ఉచిత ప్రథకం ద్వారా చెల్లించాల్సిన డబ్బులే దాదాపు రూ.3,785 కోట్లు వరకు ఉన్నాయని ఆర్టీసీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటివరకూ అప్పులు, రుణాలు, చెల్లించాల్సిన బకాయిల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మసినూసి మారేడుకాయ చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేవలం మహాలక్ష్మి ఉచితబస్సు ప్రయాణానికి సంబంధించిన బకాయిలే విడుదల చేస్తున్నది తప్ప.. ఆర్టీసీకి చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు, రుణాల డబ్బులు, రాయితీల సొమ్ము ఇవ్వడం లేదని అంటున్నారు.
2024 ఆర్థిక సంవంత్సరం నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు రూ.1,834 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంది. అయితే, వీటికి 2023 డిసెంబర్ నుంచి అమలు చేసిన ఉచిత ప్రయాణం జీరో టిక్కెట్ల డబ్బులు ఇప్పటివరకూ కడితే మొత్తం రూ.3,785 కోట్లకు పైగానే ఉంటుందని ఆర్టీసీ నిపుణులు చెప్తున్నారు. వీటితో పాటు సీసీఎస్ బకాయిలు, ఇ తర బకాయిలు కలిపితే దాదాపు రూ.10వేల కోట్లలో చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు.
డబ్బులు చెల్లించలేకనే.. ఆస్తుల అమ్మకానికి యత్నం!
ఆర్టీసీ ఉద్యోగులకు క్రమం తప్పకుండా చెల్లించాల్సిన సీసీఎస్ బకాయిలతోపాటు ఇతర పెండింగ్ బకాయిలు కోట్లలో ఉండటంతో, ప్రభుత్వ పెద్దలు ఆస్తుల అమ్మకానికి పూనుకున్నట్టు చెప్తున్నారు. ఈక్రమంలో దసరా కానుకగా.. డబుల్ డ్యూటీ సెలవులు రద్దు చేసిన ఆర్టీసీ యాజమాన్యం.. ప్రభుత్వం ఖరీదైన ఆస్తులు అమ్ముతామంటే కూడా సమ్మతం తెలుపుతుందని కార్మికులు చర్చించుకుంటున్నారు.
సీసీఎస్ పాత బకాయిలకు సంబంధించి ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యం లో, చట్టపరమైన బాధ్యతలకు అనుగుణంగా సమస్య పరిషారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్తున్నారు. ఈ మొత్తం బకాయిలు చెల్లించాలంటే.. ఎన్ని కోట్ల విలువైన ఆస్తులు అమ్ముతారు? ఎక్కడెక్కడి ఆస్తులు అమ్ముతారు? ఆ డబ్బులు ఎలా చెల్లిస్తారు? అనే విషయాల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. ఆస్తులు అమ్ముతామని సాక్షాత్తు గుర్తింపు సంఘాల సమక్షంలో చె ప్పినా.. ఎవ్వరూ ఖండించకపోవడం శోచనీయమని కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మాలని చూస్తే.. భారీ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. కార్మిక నేతలు ఈ విషయంపై పునరాలోచించుకోవాలని సూచిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

