మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
మంత్రి వివేక్ సొంత జిల్లా మంచిర్యాల, పొరుగున ఉన్న పెద్దపల్లి జిల్లాలు ఈ కుంభకోణానికి ప్రధాన కేంద్ర స్థానాలుగా ఉన్నాయని చెప్పుకొంటున్నారు. వీరి దళారీ నెట్వర్క్ అన్ని గ్రామాలకు విస్తరించిందని పేర్కొంటున్నారు. పేదలు ఏ కారణంతో మరణించినా, ఏజెంట్లు వెంటనే అక్కడ వాలిపోతున్నారని, నకిలీ పత్రాలు పుట్టించి, ప్రమాదవశాత్తు మరణించినట్టుగా దరఖాస్తు చేసి,
- కార్మికశాఖ మహా కుంభకోణంలో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
- వివేక్ సొంత జిల్లాలే దందాకు ప్రధాన అడ్డా
- గ్రామాలకు విస్తరించిన నెట్వర్క్, ఊరూరా ఏజెంట్లు
- కార్మికుడు మరణించగానే సమాచారం చేరవేత
- ప్రమాద మరణంగా నమోదుచేసి నిధులు దోపిడీ
- బాధితులకు రూ.వేలల్లో, దళారులకు రూ.లక్షల్లో
- మంత్రి సిఫార్సులే అర్హత, సీఈవో సైగే పాస్వర్డ్
ప్రత్యేక ప్రతినిధి (నమస్తే తెలంగాణ) అక్టోబర్ 16 : కార్మికశాఖలో వెలుగుచూసిన మహా కుంభకోణంపై అన్ని వేళ్లూ నేరుగా కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు సీఈవో గంగాధర్ వైపే చూపిస్తున్నాయి. మంత్రి రాసిచ్చే సిఫార్సు లేఖలే అర్హత పత్రాలుగా, బోర్డు సీఈవో కనుసైగే ఆన్లైన్ పోర్టల్ సైట్‌కు పాస్‌వర్డ్‌గా పనిచేస్తున్నాయని టంగుటూరి అంజయ్య కార్మిక సంక్షేమ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. బాధితులకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోయినా, చివరికి తెల్లకాగితాలు జతచేసినా, మంత్రి ఉత్తరం ఉంటే నిమిషాల్లో క్లెయిమ్‌లు క్లియర్ అయిపోతున్నాయని చెప్తున్నారు.
మంత్రి వివేక్ సొంత జిల్లా మంచిర్యాల, పొరుగున ఉన్న పెద్దపల్లి జిల్లాలు ఈ కుంభకోణానికి ప్రధాన కేంద్ర స్థానాలుగా ఉన్నాయని చెప్పుకొంటున్నారు. వీరి దళారీ నెట్వర్క్ అన్ని గ్రామాలకు విస్తరించిందని పేర్కొంటున్నారు. పేదలు ఏ కారణంతో మరణించినా, ఏజెంట్లు వెంటనే అక్కడ వాలిపోతున్నారని, నకిలీ పత్రాలు పుట్టించి, ప్రమాదవశాత్తు మరణించినట్టుగా దరఖాస్తు చేసి, ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పరిహారంలో బాధిత కుటుంబాలకు రూ.వేలల్లో ఇచ్చి, దళారులు రూ.లక్షల్లో మింగుతున్నారని కార్మిక శాఖ విచారణలోనే వెలుగుచూసింది.
90% బోగస్ క్లెయిమ్స్.. అయినా ఆమోదం
మంత్రి వివేక్ సొంత జిల్లా మంచిర్యాలతోపాటు పెద్దపల్లి జిల్లాలో ఈ లూటీ బరితెగింపు స్థాయికి చేరినట్టు కార్మికశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కార్మికుడి కార్డు ఎకడ నమోదై ఉన్నా.. క్లెయిమ్ తతంగం మాత్రం పెద్దపల్లి, మంచిర్యాల కేంద్రాలుగానే నడిచిందని నివేదికలు చెప్తున్నాయి. గ్రామాల్లో గతంలోనే అనారోగ్యంతో, వృద్ధాప్యంతో మరణించిన పేదల వివరాలను దళారుల నెట్వర్ సేకరించి, వారికి పాత తేదీలతో నకిలీ సర్టిఫికెట్లు పుట్టించారు. ప్రమాద బీమా రూ.6.30 లక్షలు మంజూరు కావాలంటే పోలీస్ ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం నివేదిక, శవ పంచనామా, పంచాయతీ లేదా మున్సిపల్ డెత్ సర్టిఫికెట్, తహసీల్దార్ జారీచేసే కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, మెడికల్ బోర్డు సదరం సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.
కానీ పెద్దపల్లిలో ఈ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కారు. ఒక పత్రం లేకపోయినా సరే మంత్రి అధికారిక లెటర్హెడ్స్తోనే వ్యవహారం నడిపినట్టు ఆరోపణలు ఉన్నాయి. సమాచార హకుచట్టం (ఆర్టీఐ) కింద ఓ దరఖాస్తుదారు వివరాలు కోరడంతో ఈ బాగోతం వెలుగుచూసింది. మంచిర్యాల కేంద్రంగా పరిశీలించిన 84 క్లెయిమ్‌లలో కేవలం 10 దరఖాస్తులకు మాత్రమే అరకొర ఆధారాలు ఉండగా, మిగతా 74 దరఖాస్తుల్లో అసలు ఎలాంటి పత్రాలూ లేవని, అన్నీ నకిలీ సర్టిఫికెట్లు, తెల్ల కాగితాలేనని అధికారిక విచారణలోనే తేలింది. ఇక పెద్దపల్లి జిల్లా పరిధిలో 91 మంది కార్మికులు మరణించినట్టు క్లెయిమ్‌లు చేయగా, అందులో ఏకంగా 80 క్లెయిమ్‌లు పూర్తిగా బోగస్ అని తేలింది. అంతేగాకుండా, శాశ్వత వైకల్యం కింద బీమా పరిహారం పొందిన 15 మంది కూడా అనర్హులేనని బహిర్గతమైంది. నకిలీ ఎఫ్ఐఆర్లు, నకిలీ సీళ్లు సృష్టించి మరీ ఈ దోపిడీకి తెగబడినట్టు ఆధారాలు లభించాయి.

పాత చెవుడు.. కొత్త కథ.. మధ్యలో మంత్రి లేఖ
కార్మికశాఖలో జరిగిన కుంభకోణాల్లో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నుంచి వచ్చిన సిఫార్సు లేఖలు ఎంతటి కీలక పాత్ర పోషించాయో అనేక ఉదాహరణలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాకు చెందిన నూనె శ్రీనివాస్ (రిజిస్ట్రేషన్ నంబర్ ఏఎల్వోకేఆర్ఎంఆర్ 2/2023/00863) వ్యవహారం ఒక తిరుగులేని నిదర్శనం. నూనె శ్రీనివాస్‌కు 76 శాతం శాశ్వత వినికిడి లోపం ఉన్నట్టు 2019 మే 9న కరీంనగర్ జిల్లా ప్రధాన దవాఖాన వైద్యులు నిర్ధారించారు. యూడీఐడీ నంబర్ ‘టీజీ 0310419950159443’తో ధ్రువీకరణ పత్రం కూడా జారీచేశారు. ఆయన 2023 మార్చి 28న కార్మిక సంక్షేమ బోర్డులో సభ్యుడిగా చేరారు. 2024 ఫిబ్రవరి 17న తనకు రోడ్డు ప్రమాదం జరిగిందంటూ ఓ కథ అల్లారు.
ఆ ప్రమాదంతో తనకు 50 శాతానికి పైగా శాశ్వత పాక్షిక వైకల్యం వచ్చిందంటూ 2026 ఏప్రిల్ 16న మీసేవ ద్వారా పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు పత్రాల్లోని డొల్లతనాన్ని గుర్తించి క్లెయిమ్‌ను తిరసరించారు. ఈ అంశంలో నిబంధనలను బుట్టదాఖలు చేస్తూ మంత్రి వివేక్ వెంకటస్వామి తన అధికారిక లెటర్‌హెడ్‌పై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి స్వయంగా నోట్ పంపించారు. 2026 జూన్ 17న మంత్రి జారీచేసిన ఈ అధికారిక లేఖలో ‘నూనె శ్రీనివాస్ దరఖాస్తును పరిశీలించి, అతనికి వర్తించే ప్రయోజనాలను అత్యవసర ప్రాధాన్యం ప్రాతిపదికన, సాధ్యమైనంత త్వరగా మంజూరు చేయాలని కోరుతున్నాను’ అని పేరొన్నారు. దాంతో అధికారులు ఆ దరఖాస్తును ఆమోదించారు.
బాధితుడికి 40వేలు.. దళారులకు 5.9 లక్షలు
కొమరవ్వ ఘటనలో దళారులు అక్కడితో ఆగలేదు. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోడ్డుప్రమాద మరణానికి పోలీస్ ఎఫ్ఐఆర్, శవ పంచనామా, పోస్టుమార్టం నివేదికలు తప్పనిసరి. కానీ ‘నమస్తే తెలంగాణ’ క్షేత్రస్థాయిలో లోతైన పరిశీలన జరుపగా, గన్నేరువరం పోలీస్‌స్టేషన్‌లో కొమరవ్వ పేరు మీద ఎలాంటి కేసూ నమోదు కాలేదని తేలింది. అంటే దళారులు ప్రభుత్వాన్ని మోసంచేశారు. ఈ క్లెయిమ్‌లో మృతురాలి కొడుకు ఆనంద్ నామినీగా ఉన్నారు. ఆయనకు కొండాపూర్ ఎస్బీఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. కానీ ‘ఆ బ్యాంకు ఖాతాలు చెల్లవు’ అంటూ పైరవీకారులు నమ్మబలికారు.
కరీంనగర్‌లోని భద్రాద్రి కో-ఆపరేటివ్ బ్యాంకులో కొత్తగా ఖాతా తెరిపించారు. ఆ వెంటనే చెక్‌బుక్ ఇప్పించి, నాలుగు ఖాళీ చెకులపై ఆనంద్‌తో ముందే సంతకాలు పెట్టించుకున్నారు. ప్రభుత్వం నుంచి రూ.6.30 లక్షల పరిహారం ఖాతాలో జమకాగానే, దళారులు ఆ చెక్కుల సాయంతో మొత్తం డ్రా చేసుకున్నారు. ఆనంద్‌కు మాత్రం ప్రభుత్వం నుంచి రూ.70 వేలు మాత్రమే మంజూరయ్యాయి అంటూ అబద్ధం చెప్పారు. అందులోనూ కమీషన్ల పేరిట కోతలు పెట్టి, చివరికి రూ.40 వేలు మాత్రమే ఇచ్చారని బాధితుడు ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. మిగిలిన రూ.5.90 లక్షలు దళారులు, అధికారులు స్వాహా చేశారని బాధితుడు వాపోయారు.
బోర్డు సీఈవో ఆమోదముద్రల వెనుక మర్మం?
ఈ దందాలో కార్మికశాఖ మంత్రి పీఏ చక్రం తిప్పినట్టు జోరుగా చర్చ సాగుతున్నది. ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన కార్మికశాఖ అధికారుల బదిలీలు, పోస్టింగులు, క్లెయిమ్‌ల అనుమతులన్నీ సదరు పీఏ కనుసన్నల్లోనే నడిచినట్టు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. బాగో తం బట్టబయలు కావడంతో వరంగల్ జా యింట్ లేబర్ కమిషనర్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా మంచిర్యాల జిల్లా ఏఎల్వో, డీఎల్వోను సస్పెండ్ చేసి, విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
అయితే ఇది కేవలం కింది స్థాయి అధికారులను బలిపశువులను చేసి, తెరవెనుక ఉన్న అసలు తిమింగలాలను కాపాడేందుకు ఆడుతున్న కంటితుడుపు చర్యలనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డు సీఈవో గంగాధర్ ఆమోదముద్ర, మంత్రి కార్యాలయం నుంచి జారీ అయిన సిఫార్సు లేఖలపై దృష్టి సారించకుండా విచారణను నీరుగార్చే ప్రయత్నం జరుగుతున్నదనే అనుమానాలు బలపడుతున్నాయి. అధికారులు ఇంతకాలం కండ్లు మూసుకుని ఉండటం వెనుక ఎవరి జేబుల్లోకి ఎంత మొత్తం చేరిందో తేలాల్సి ఉన్నది. ఈ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో గానీ, సీబీఐతో గానీ సమగ్ర విచారణ జరిపించినప్పుడే సూత్రధారులు బయటికి వస్తారని కార్మికులు చెప్తున్నారు.

గొలుసుకట్టు దోపిడీ
ఈ కుంభకోణం కేవలం కిందిస్థాయి సిబ్బంది చేసిన సాధారణ చేతివాటం మాత్రమే కాదు. పకా పన్నాగంతో అధికార యంత్రాంగం, దళారులు కుమ్మకై నడిపించిన ఒక వ్యవస్థాగత గొలుసుకట్టు దోపిడీ అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తతంగంలో నకిలీ లేబర్ కార్డులు ఎవరు సృష్టించారు? ఫేక్ డెత్ సర్టిఫికెట్లు, నకిలీ ఎఫ్ఐఆర్లు ఎవరు తెచ్చారు? ఆధారాలు లేని దరఖాస్తులను మీసేవ ద్వారా ఎవరు అప్లోడ్ చేశారు? వాటిని ఎవరు ఆమోదించారు? వంటివి పరిశీలిస్తే విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
దరఖాస్తు రాగానే ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాల్సిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు సీటు నుంచి కదలకుండానే సంతకాలు పెడుతున్నారని, జిల్లా స్థాయిలో సమగ్రంగా పరిశీలించాల్సిన నోడల్ అధికారులు, డీఎల్వోలు తెల్లకాగితాలను చూసికూడా ఆమోదముద్ర వేశారని, కార్మిక సంక్షేమ బోర్డు సీఈవో స్థాయిలో క్షణాల్లో క్లియరెన్స్ లభించి, బీమా కంపెనీల నుంచి డబ్బులు నేరుగా పైరవీకారులు సృష్టించిన ఖాతాల్లోకి చేరుతున్నాయని.. ఇదంతా ఒక చైన్‌లా నడుస్తున్నదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా నిజాయితీ గల అధికారి అనుమానం వ్యక్తం చేసి ఫైలును ఆపితే.. వెంటనే మంత్రి పేషీ నుంచి ఒత్తిళ్లు, రికమండేషన్ నోట్లు జారీ అయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గ్రామస్థాయి దళారీ మొదలుకొని ఏఎల్వో, డీఎల్వో, నోడల్ ఆఫీసర్, బోర్డు సీఈవో, చివరికి సచివాలయంలోని మంత్రి కార్యాలయం వరకు ప్రతి అడుగులోనూ ఎవరి వాటాలు వారికి పక్కాగా చేరిన ఒక వ్యవస్థీకృత సిండికేట్ పనిచేసిందని కార్మిక సంఘాలు చెప్తున్నాయి.
గద్దల్లా వాలిపోతున్న ఏజెంట్లు
ఈ దళారీ వ్యవస్థ గ్రామాల్లో వేళ్లూనుకొని పోయిందని, ప్రతి ఊరిలోనూ ఏజెంట్లను నియమించుకున్నారని చెప్తున్నారు. వారు ఆయా గ్రామాల్లో ఎవరు మరణించినా వెంటనే పైకి సమాచారం అందిస్తున్నారని, ఆ తర్వాత గద్దల్లా వాలిపోతూ పేదల శవాలపై కాసుల వేట సాగిస్తున్నారని చెప్తున్నారు. దీనిని ఉదాహరణలతో ‘నమస్తే తెలంగాణ’ ఇప్పటికే వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సభ్యసమాజమే నివ్వెరపోయే మరో దారుణ ఘటన గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్‌లో బట్టబయలైంది. ఆ గ్రామానికి చెందిన దొమ్మాటి కొమరవ్వ గుండెపోటుకు గురై, కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు.
ఆమెది సాధారణ మరణమని డెత్ సర్టిఫికెట్ కూడా జారీ అయింది. కానీ దళారుల ముఠా దానిని ‘రోడ్డు ప్రమాద మరణం’గా మార్చేసింది. ఏకంగా రూ.6.30 లక్షల క్లెయిమ్‌ను కొల్లగొట్టేందుకు 2026 జనవరి 16న మీసేవ ద్వారా దరఖాస్తు చేయించింది. మంచిర్యాల-1 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ఏఎల్వో), మంచిర్యాల నోడల్ ఆఫీసర్లు ఆమోదించారు. ఫిబ్రవరి 4న బోర్డు స్థాయిలో కూడా గ్రీన్‌సిగ్నల్ ఇప్పించారు. వెంటనే ఫిబ్రవరి 5న సంక్షేమ బోర్డు నుంచి రూ.6.30 లక్షల నిధులు విడుదలయ్యాయి. అంటే దరఖాస్తు చేసిన 20 రోజుల్లోనే ఆమోదం పొంది, నిధులు విడుదలయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

