రింగురోడ్డులో.. కమీషన్ల వేట!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని సర్కార్ పెద్దలు భావిస్తున్నట్టున్నారు. ఇందుకు ఆర్ఆర్ఆర్ను కామ ధేనువుగా మార్చుకున్నారు.
- 16000 కోట్ల ప్రాజెక్టు బదలాయింపు
- హెచ్‌జీసీఎల్ చేతికి ట్రిపుల్ఆర్ సౌత్
- కేంద్రం స్పష్టత ఇవ్వకముందే అత్యుత్సాహం
- ప్రజాధనాన్ని దిగమింగేందుకు వెంపర్లాట
- ఇప్పటికే రేడియల్ రోడ్లలో భారీ అవినీతి
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని సర్కార్ పెద్దలు భావిస్తున్నట్టున్నారు. ఇందుకు ఆర్ఆర్ఆర్ను కామ ధేనువుగా మార్చుకున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు రాకముందే తాజాగా ట్రిపుల్ ఆర్ సౌత్ ప్రాజెక్టును ఆర్అం డ్బీనుంచి హెచ్ఎండీఏ-హెచ్‌జీసీఎల్‌కు బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే హెచ్ఎండీఏ రూ.వేల కోట్లతో చేపట్టిన రేడియల్ రోడ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని సొంత పార్టీ ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు రోడ్డెక్కుతున్న సమయంలో హెచ్‌జీసీఎల్‌కు కీలక ప్రాజెక్టును అప్పగించడంపై దుమారం రేగుతున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇటీవల చేపట్టిన రేడియల్ రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేసి, అధికార పార్టీ నేతలు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రజాధనాన్ని కొల్లగొట్టారనే విమర్శలు తీవ్రస్థాయిలో వచ్చాయి. ఆ అవినీతి మరకలు ఇంకా వీడకముందే, ఇప్పుడు రూ.16 వేల కోట్ల విలువైన ట్రిపుల్ ఆర్ సౌత్ ప్రాజెక్టును హెచ్‌జీసీఎల్ చేతిలో పెట్టడం ద్వారా మరో దోపిడీకి తెరలేపారనే చర్చ జరుగుతున్నది.
విజయవాడ నేషనల్ హైవేలోని చౌటుప్పల్ నుంచి ముంబై హైవేలోని సంగారెడ్డి వరకు దాదాపు 201 కిలోమీటర్ల మేర ట్రిపుల్ ఆర్ సౌత్ ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదించారు. దీని అంచనా వ్యయం రూ.16 వేల కోట్లు. ఇందుకోసం దాదాపు 2,010 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. భూ సేకరణ, నిర్మాణ అంచనా వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సగంసగం భరించనున్నాయి. జాతీయ రహదారుల సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనున్నది. కానీ నిధుల లభ్యత, కేంద్రం నుంచి సౌత్ ప్రాజెక్టుకు ఎలాంటి స్పష్టత రాకముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును హెచ్‌జీసీఎల్‌కు బదలాయించింది. వాస్తవానికి ఫ్యూచర్ సిటీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రియల్ డ్రామా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ విషయంలో నియంత్రణ పూర్వకంగా వ్యవహరిస్తున్నది.
అందుకే ఇప్పటికే భూసేకరణ పూర్తి కావాల్సిన నార్త్ పార్ట్‌ను పక్కన పెట్టింది. సౌత్ పార్ట్‌పై భారీ ఆశలు పెట్టుకున్న ప్రభుత్వ పెద్దలు ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేశారు. కేంద్రంతో సంబంధం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఈ ప్రాజెక్టు చేపడుతామని ప్రకటించారు. తద్వారా కాంట్రాక్టులు, కమీషన్లు, భూ సేకరణ పరిహారంలో జిమ్మిక్కులతో జేబులు నింపుకొనేందుకు పక్కా ప్రణాళికలు రచించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
కామధేనువుగా మార్చే కుట్ర
ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ పేరుతో సౌత్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వం గొప్పులు చెప్తున్నది. అయితే రియల్ ఎస్టేట్ ముసుగులో పెద్ద ఎత్తున కమీషన్లు దండుకోవడమే ప్రభుత్వ పెద్దల ప్లాన్ అనే విమర్శలు బలపడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి స్పష్టమైన ఆర్థిక వనరులు లేకుండా కేవలం పంతానికిపోయి రూ.వేల కోట్ల ప్రాజెక్టులను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడమే ఇందుకు నిదర్శనమని నిపుణులు చెప్తున్నారు. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా, రాష్ట్ర ప్రజల మీద అప్పుల భారం మోపైనా సరే ప్రాజెక్టును ముందుకు తెస్తామనడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనాన్ని రక్షించాల్సింది పోయి ఇలాంటి భారీ ప్రాజెక్టులను కామధేనువులా మార్చుకొని, కమీషన్ల కోసం ఆరాటపడుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రాజెక్టును హెచ్‌జీసీఎల్‌కు అప్పగించడంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ మార్పిడీపై రోడ్లు, భవనాల శాఖ, హెచ్‌జీసీఎల్ ఉన్నతాధికారులు మౌనం వహించారు. ప్రాజెక్టుల బదలాయింపు ప్రభుత్వ నిర్ణయమని, అధికారుల ప్రమేయం ఉండదని కిందిస్థాయి సిబ్బంది తెలిపారు.
ట్రిపుల్ ఆర్ సౌత్ స్వరూపమిది
విజయవాడ నేషనల్ హైవేలోని చౌటుప్పల్ నుంచి ముంబై హైవేలోని సంగారెడ్డి వరకు దాదాపు 201 కిలోమీటర్ల పొడవునా రీజినల్ రింగు రోడ్డు సౌత్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. అంచనా వ్యయం రూ.16 వేల కోట్లు. చౌటుప్పల్, మాల్, ఆమనగల్, షాద్‌నగర్, చేవెళ్ల, శంకర్పల్లి, వికారాబాద్ మీదుగా సాగే ఈ ప్రాజెక్టు కోసం 2,010 హెక్టార్ల భూమి అవసరం అవుతుందని అంచనా వేశారు. రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టులకు భూసేకరణ, నిర్మాణ వ్యయాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

