ఒకప్పుడు ఓనర్..ఇప్పుడు మీడియేటర్
తెలంగాణలో పదుల కొద్దీ విద్యుత్తు ప్లాంట్లను నిర్మించి యావత్ రాష్ర్టానికి వెలుగులు పంచిన సంస్థ అది. అపార అనుభవం, భారీ ప్రాజెక్టులను నిర్మించగల సామర్థ్యం కలిగిన ఆ సంస్థకు వేల ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి.
- కాంగ్రెస్ పాలనలో తారుమారైన జెన్కో పరిస్థితి
- బేస్ ప్లాంట్ల ఏర్పాటులో ప్రైవేట్‌కు రెడ్ కార్పెట్
- స్థలం, గ్యారెంటీ జెన్కోదే.. లాభాలు మాత్రం ప్రైవేట్‌కే
- జెన్కో పుట్టి మునగడం ఖాయమంటున్న నిపుణులు
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో పదుల కొద్దీ విద్యుత్తు ప్లాంట్లను నిర్మించి యావత్ రాష్ర్టానికి వెలుగులు పంచిన సంస్థ అది. అపార అనుభవం, భారీ ప్రాజెక్టులను నిర్మించగల సామర్థ్యం కలిగిన ఆ సంస్థకు వేల ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇంతటి ప్రాశస్త్యం గల తెలంగాణ పవర్ జెనరేషన్ కార్పొరేషన్ (టీజీ జెన్కో) పరిస్థితి కాంగ్రెస్ పాలనలో తారుమారయ్యింది. ఇన్నాళ్లూ ఓనర్లా ఓ వెలుగు వెలిగిన ఈ సంస్థను రేవంత్‌రెడ్డి సర్కార్ పూర్తిగా దిగజార్చింది. ప్రైవేట్ సంస్థల రుణాలకు గ్యారెంటీ ఇచ్చే మధ్యవర్తిగా మార్చేసింది. గతంలో అన్ని ప్రభుత్వాలు జెన్కోను బలోపేతం చేశాయి. విద్యుత్తు అవసరాలు పెరుగుతున్న కొద్దీ జెన్కో విస్తరణకు అవకాశం కల్పించాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించి, కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయించాయి. దీంతో వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సమకూర్చుకోగలిగిన జెన్కోను కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ‘మీడియేటర్’ స్థాయికి దిగజారింది.
ఇంతకు ఏం జరిగిందంటే..
గ్రీన్ పవర్ వినియోగంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం గత కొంత కాలంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ (బేస్) ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. పగటిపూట ఉత్పత్తయ్యే సౌర విద్యుత్తు (సోలార్ పవర్)తోపాటు సాయంత్రం పూట ఉత్పత్తయ్యే పవన విద్యుత్తు (విండ్ పవర్)ను బ్యాటరీల్లో నిల్వచేసి రాత్రి వేళల్లో లేదా విద్యుత్తు డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో గ్రిడ్‌కు సరఫరా చేయడం బేస్ ప్లాంట్ల ప్రత్యేకత. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరుగడంతో 500 మెగావాట్స్ (పర్ ఫోర్ అవర్స్) బేస్ ప్లాంట్ల నిర్మాణానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. దీంతో వీటిని టీజీ జెన్కో ఆధ్వర్యంలో నిర్మిస్తారని అంతా భావించారు. కానీ, కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా జెన్కోను తప్పించి, ప్రైవేట్ డెవలపర్లకు ఎర్రతివాచీ పరిచింది.
గతంలోను అంతే..
రాష్ట్రంలో బేస్ ప్లాంట్ల ఏర్పాటు కోసం పరాయి సంస్థలకు ఎర్రతివాచీ పరవడం ఇదేమీ కొత్త కాదు. గతంలో మహేశ్వరం, చౌటుప్పల్‌లో 750 మెగావాట్ల (187.5 మెగావాట్స్ పర్ ఫోర్ అవర్స్) చొప్పున సామర్థం కలిగిన బేస్ ప్లాంట్ల ఏర్పాటుకు జెన్కో టెండర్లు పూర్తిచేసింది. చౌటుప్పల్ ప్లాంట్ టెండర్‌ను కోలిండియా సంస్థ దక్కించుకున్నది. రూ.1.057 కోట్ల వ్యయంతో ఆ ప్లాంట్‌ను నెలకొల్పనున్నది. దీంతో నెలకు ఒక మెగావాట్ విద్యుత్తును సరఫరా చేసినందుకు ఆ సంస్థకు రూ.3.14 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. మహేశ్వరంలో నెలకొల్పాల్సిన బేస్ ప్లాంట్ టెండర్‌ను సరస్ అనే సంస్థ దక్కించుకున్నది. కానీ, లెటర్ ఆఫ్ అవార్డ్ (ఎల్వోఏ) జారీచేసిన తర్వాత ఆ సంస్థ అనూహ్యంగా తప్పుకోవడంతో మళ్లీ టెండర్లు పిలువాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బ్యాటరీవే ఎందుకంటే..
రాష్ట్రంలో సోలార్ విద్యుత్తు అందుబాటులో ఉన్నప్పుడు కరెంట్‌కు ఇబ్బందులేమీ ఉండవు. కానీ సమస్యంతా సోలార్ అందుబాటులో లేని రాత్రి వేళల్లోనే. రాత్రి సమయంలో విద్యుత్తు లభ్యమవడం లేదు. పగటిపూట 19 గిగావాట్ల విద్యుత్తును సరఫరా చేస్తున్న రాష్ట్రం.. రాత్రికి వచ్చేసరికి కేవలం 9 గిగావాట్లకే పరిమితమవుతున్నది. సోలార్ విద్యుత్తు అందుబాటులో లేకపోవడం, బహిరంగ మార్కెట్లో విద్యుత్తు లభించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో థర్మల్ విద్యుత్తుపై రాష్ట్రం అధికంగా ఆధారపడాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం తెలంగాణకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్లను మంజూరు చేసింది.
అప్పులు ఎగ్గొడితే..
బేస్ ప్లాంట్లు పెట్టిన సంస్థలు జెన్కో గ్యారెంటీతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాయి. దీంతో ఆ అప్పులను ఎగవేస్తే పరిస్థితి ఏందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చివరికి ఈ అప్పులు గ్యారెంటీ ఇచ్చిన జెన్కో పాలిట గుదిబండగా మారుతాయని జెన్కో ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జెన్కోకు రూ.వేల కోట్లు బాకీపడిన రాష్ట్ర ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించలేక చేతులెత్తేసింది. అయినా జెన్కో ఉత్పత్తి ఆపలేదు. విద్యుత్తును నిలిపివేయలేదు. కానీ, రేపు బేస్ ప్లాంట్లు ఏర్పాటు చేసే సంస్థకు ప్రభుత్వం సక్రమంగా బిల్లులు చెల్లించకపోతే కరెంట్ నిలిపివేసే ప్రమాదం లేకపోలేదు. స్థలమిచ్చి, అప్పులకు గ్యారెంటీ ఇచ్చి, కేంద్రం నుంచి వీజీఎఫ్‌ను సమకూర్చిన తర్వాత ప్రైవేట్ సంస్థలు కరెంట్ కట్ చేస్తే పరిస్థితి ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రైవేట్ సంస్థలను నమ్ముకోవడం సరికాదని, జెన్కో ఆధ్వర్యంలోనే బేస్ ప్లాంట్లు నెలకొల్పడం ఉత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
పెద్దల స్వలాభం కోసమే..
బేస్ ప్లాంట్లను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం వెనుక భారీ కుంభకోణం ఉన్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొందరు పెద్దల స్వలాభం కోసమే ఇలా చేస్తున్నారని జెన్కో ఇంజినీర్లు వాపోతున్నారు. నెహ్రూ ఆర్థిక విధానాలను అనుసరిస్తున్నామని, ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తామని గొప్పలు చెప్తున్న ప్రభుత్వ పెద్దలు ప్రైవేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరచడమేందని నిలదీస్తున్నారు.
స్థలం.. ఆర్థిక భరోసా జెన్కోదే.. లాభాలు మాత్రం ప్రైవేట్ సంస్థలకే
బేస్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన జెన్‌కోయే సమకూర్చాల్సి ఉన్నది. దీంతో చౌటుప్పల్, మహేశ్వరంలోని సబ్స్టేషన్ల స్థలాల్లో ప్రైవేట్ సంస్థలు వాటిని ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్లాంట్లకు కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్)ను సమకూరుస్తుంది. ఇది ప్రైవేట్ సంస్థల ఖాతాల్లోకే వెళ్తుంది. టెండర్లు దక్కించుకున్న సంస్థలకు జెన్‌కోయే గ్యారెంటీ ఇవ్వాలి. ఈ గ్యారెంటీ ఆధారంగానే ఆయా సంస్థలు బ్యాంకుల నుంచి రుణాలు పొందుతాయి. ప్లాంట్లు నెలకొల్పిన తర్వాత ఆ సంస్థలే లాభాలను పోగేసుకుంటాయి. అంటే జెన్కో ఇప్పుడు మధ్యవర్తి స్థాయికి దిగజారిందన్నమాట.
టెండర్ల ఆహ్వానం..
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో 300 మెగావాట్లు, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 200 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయించిన జెన్కో.. ఆ తర్వాత అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నది. ప్రైవేట్ డెవలపర్లతో బిల్డ్ ఓన్ ఆపరేట్ (బీవోవో) పద్ధతిలో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయించేందుకు ఇటీవల జెన్కో టెండర్లను ఆహ్వానించింది. ఆన్లైన్లో నవంవర్ 4 వరకు, ఆఫ్‌లైన్‌లో నవంబర్ 7 వరకు బిడ్స్ దాఖలు చేసేందుకు వీలుకల్పించింది. నవంబర్ 10న బిడ్లు తెరుస్తారు. టెండర్లు గెలుచుకున్న సంస్థలతో 15 ఏండ్లపాటు విద్యుత్తు కొనుగోలు ఒప్పందం అమల్లో ఉంటుంది. ప్లాంట్ల నిర్మాణం పూర్తయ్యాక ఆ సంస్థలు నిరంతరం (రౌండ్ ది క్లాక్) విద్యుత్తు సరఫరా చేయాల్సి ఉంటుంది. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు పీక్ అవర్స్‌లో రోజూ 4 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును అందించాల్సి ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

