పెద్దల్ని తప్పించిన స్కామ్.. కార్మిక బీమా కుంభకోణంలో డైవర్షన్ గేమ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధుల దోపిడీ వ్యవహారంలో కొత్త డైవర్షన్ గేమ్ మొదలైంది. ఈ స్కామ్‌లో అసలు సూత్రధారులైన ప్రభుత్వ పెద్దలను కాపాడటానికే సస్పెన్షన్ డ్రామాలకు ప్రభుత్వం తెరతీసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
- మంత్రి మెడకు చుట్టుకోకుండా వేటు డ్రామా!
- మంత్రి సిఫార్సులతోనే అక్రమాలకు పడిన బీజం
- బయటకు రాకుండా ఇద్దరు అధికారుల సస్పెన్షన్
- మంత్రి ఆఫీసుపై ఆరోపణలతో మళ్లీ అప్రమత్తం
- ఈసారి సంక్షేమ బోర్డు సీఈవో గంగాధర్‌పై వేటు
- పెదల్ని కాపాడేందుకే డ్రామా అంటున్న కార్మికులు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధుల కుంభకోణంలో కొత్త గేమ్ మొదలైంది. అసలు సూత్రధారులను కాపాడేందుకు సస్పెన్షన్ల డ్రామాకు, డైవర్షన్‌కు తెరతీశారు. ఇప్పటికి ముగ్గురు ఉద్యోగులను బలిచేసిన ప్రభుత్వం.. పెద్దల్ని ముట్టుకోవడానికి మాత్రం జంకుతున్నది.
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధుల దోపిడీ వ్యవహారంలో కొత్త డైవర్షన్ గేమ్ మొదలైంది. ఈ స్కామ్‌లో అసలు సూత్రధారులైన ప్రభుత్వ పెద్దలను కాపాడటానికే సస్పెన్షన్ డ్రామాలకు ప్రభుత్వం తెరతీసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికుల ప్రాణాలకు భరోసా కల్పించాల్సిన బీమా పథకాన్ని దళారులు, ప్రైవేట్ బ్రోకింగ్ సంస్థలు, కొందరు అధికారులు కలిసి దోపిడీకి మార్గంగా మార్చుకున్నారు. ఈ బాగోతాన్ని ‘నమస్తే తెలంగాణ’ వరుస పరిశోధనాత్మక కథనాలతో బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు, బోగస్ ప్రమాదాల ఎఫ్ఐఆర్లు, అర్హతలేని క్లెయిమ్‌లు, మంత్రి సిఫార్సు లేఖలు.. ఇలా ఒకొకటిగా వెలుగులోకి రావడంతో కార్మిక శాఖలో ప్రకంపనలు మొదలయ్యాయి.
మొదట ఇద్దరు కిందిస్థాయి అధికారులపై సస్పెన్షన్ వేటు వేసి ప్రభుత్వం మమ అనిపించింది. ఈ వివాదం మంత్రి కార్యాలయం వరకు చేరడంతో ప్రభుత్వం ఉకిరిబికిరైంది. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది, తాజాగా బోర్డు సీఈవో గంగాధర్‌ను బాధ్యతల నుంచి తప్పించింది. ఈ మేరకు గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. కానీ వాటిని గోప్యంగా ఉంచింది. మంత్రి కార్యాలయ ప్రమేయంపై లోతైన దర్యాప్తు జరుగాల్సిన సమయంలో కేవలం ఉన్నతాధికారిని తప్పించేసి.. ఈ స్కామ్ వెనుక ఉన్న రాజకీయ పెద్దలైన అసలు సూత్రధారులను కాపాడే ప్రయత్నం జరుగుతున్నదని కార్మిక సంక్షేమ భవన్లో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది.
రూ.150 కోట్ల స్కామ్.. నామమాత్రంగా చర్యలు
తొలుత మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వెలుగుచూసిన ఈ అక్రమాలు ఆ తర్వాత రాష్ట్రవ్యాప్త నెట్వర్గా విస్తరించినట్టు తాజాగా తెలిసింది. కార్మికుడు చనిపోయిన వెంటనే సమాచారం చేరవేసే ఏజెంట్లు, మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరించే దళారులు, నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించే ముఠాలు, వాటిని పరిశీలించకుండానే ఆమోదించే కొందరు అధికారులు.. ఇలా ఒక వ్యవస్థీకృత గొలుసుగా పనిచేసినట్టు బహిర్గతమైంది. లోతుగా పరిశోధించగా పెద్దపల్లి జిల్లాలో సుమారు 520 అనుమానాస్పద క్లెయిమ్‌లు వెలుగులోకి వచ్చాయి. మంచిర్యాల జిల్లాలో 84 దరఖాస్తులను పరిశీలించగా 74 క్లెయిమ్‌లకు సరైన ఆధారాలు లేవని తేలింది. సూర్యాపేటలోనూ అనుమానాస్పద క్లెయిమ్‌లు బయటపడ్డాయి. ఈ అక్రమాల విలువ రూ.150 కోట్లకు పైగా ఉంటుందనే ఆరోపణలు కార్మిక శాఖను కుదిపేశాయి. ‘నమస్తే’ వరుస కథనాలతో స్పందించిన ప్రభుత్వం తూతూమంత్రపు చర్యలు చేపట్టింది. మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. అనంతరం కార్మిక శాఖ వరంగల్ రీజియన్ జాయింట్ కమిషనర్‌తో అంతర్గత విచారణ జరిపించింది. ఆ విచారణలోనూ రూ.10 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. అయినా అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం, దారిమళ్లిన సొమ్మును రికవరీ చేయడం వంటి చర్యలు కనిపించలేదు. ఈ నేపథ్యంలో విచారణలోని లోపాలను ఎత్తిచూపుతూ సెప్టెంబర్ 1న ‘బీమా క్లెయిమ్‌ల సామ్‌పై తూతూమంత్రంగా విచారణ’ శీర్షికన నమస్తే తెలంగాణలో కథనం ప్రచురితమైంది.
బయటపడ్డ మంత్రి పేషీ వ్యవహారం
ఈ దశలోనే మంత్రి సిఫార్సు లేఖల వ్యవహారం తెరపైకి వచ్చింది. అక్రమ క్లెయిమ్‌లను ఆమోదింపజేయడంలో మంత్రి కార్యాలయం నుంచి ఒత్తిళ్లు వచ్చాయన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. కొన్ని క్లెయిమ్‌లకు అవసరమైన ఆధారాలు లేకపోయినా మంత్రి సిఫార్సు లేఖల ఆధారంగా ప్రాధాన్యమిచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తిరసరణకు గురైన దరఖాస్తుకు మంత్రి అధికారిక లెటర్ హెడ్‌పై సిఫార్సు లేఖ ఇచ్చినట్టు ‘నమస్తే తెలంగాణ’ పరిశోధనలో వెల్లడైంది. క్లెయిమ్‌ను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి మంజూరు చేయాలని సూచించినట్టు వెలుగులోకి తెచ్చింది. ఈ మేరకు ‘నమస్తే’లో అక్టోబర్ 13న ‘శవాల మీది పేలాల మేత.. 150 కోట్ల సామ్’, అక్టోబర్ 17న ‘మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం’ శీర్షికన ప్రచురితమైన కథనాలు కార్మిక శాఖలోని వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులతోపాటు మంత్రి కార్యాలయం పాత్రపై ప్రశ్నలు లేవనెత్తింది.
తప్పించుకొనేందుకు మరో వేటు
‘నమస్తే’ వరుస కథనాల నేపథ్యంలో సంక్షేమ బోర్డు సీఈవో గంగాధర్ స్పందించారు. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా వరంగల్ జాయింట్ కమిషనర్‌తో అంతర్గత విచారణ జరిపిస్తున్నామని ప్రకటించారు. నిబంధనల ప్రకారమే క్లెయిమ్‌లను పరిషరిస్తున్నామని, తప్పు చేసిన బీమా బ్రోకింగ్ సంస్థలపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే, ఈ కుంభకోణంలో అక్రమాల పరిధి, బాధ్యతలపై లోతుగా విచారణ జరుగాల్సి ఉన్నది. క్లెయిమ్‌లను ఎవరు పరిశీలించారు? క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయకుండా ఎవరు ధ్రువీకరించారు? బోర్డు పోర్టల్‌లో ఎవరు ఆమోదించారు? బీమా సంస్థకు ఎవరు చెల్లింపులు చేయాలని ఆదేశించారు?
మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సిఫార్సు లేఖలను ఏయే అధికారులు, ఏ ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉన్నది. కానీ ఈ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే సీఈవో గంగాధర్‌ను బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది కొత్త వివాదానికి దారితీసింది. వాస్తవానికి ఈ స్కామ్‌లో గంగాధర్ పాత్రపైనా విచారణ జరుగాల్సి ఉన్నది. క్లెయిమ్‌ల ఆమోద ప్రక్రియలో సీఈవో కీలకం. సరైన పత్రాలు లేకుండానే క్లెయిమ్‌లు ఆమోదం పొందితే ఆయన బాధ్యత ఎంత? మంత్రి కార్యాలయం నుంచి సిఫార్సులు వచ్చినప్పుడు వాటిని ఎలా పరిశీలించారు? అనుమానాస్పద దరఖాస్తులను ఎందుకు నిలిపివేయలేదు? ప్రైవేట్ బ్రోకింగ్ సంస్థతో ఒప్పందం, నిధుల విడుదలలో ఆయన పాత్ర ఏమిటి?
వంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉన్నది. ముఖ్యంగా మంత్రి కార్యాలయ సిఫార్సులపైనా విచారణ జరుగాల్సి ఉన్నది. దర్యాప్తు సంస్థలు ఈ అంశాలపై లోతుగా విచారణ జరుపకముందే గంగాధర్‌ను తప్పించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్కామ్‌కు ఆయనను మాత్రమే బాధ్యుడిగా చూపించి, ఇతర స్థాయిల్లోని నిర్ణయాధికారులను విచారణ నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చిన ఈ కుంభకోణంపై ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే సీఈవో మార్పుతో సరిపెట్టకుండా, మంత్రి కార్యాలయం మొదలుకొని బోర్డు స్థాయి వరకు ప్రతి నిర్ణయంపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

