నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 7: రేవంత్.. ఏదీ కరెంట్ అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. 24 గంటల కరెంటిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించగా ఎక్కడిస్తున్నారని రైతులు నిలదీస్తున్నారు. విద్యుత్తు కోతలు, లోవోల్టేజీ సమస్యలపై భగ్గుమంటున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో కరెంట్ కోతలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెలుస్తలేదని ఆందోళన చెందుతున్నారు. ఈ ఒక్క నెల కరెంట్ సక్కగా ఇస్తే పంటలు చేతికొస్తాయని రైతులు ఆశిస్తున్నారు. ఎడాపెడా కరెంట్ కోతలు, లోవోల్టేజీ సమస్యలు మాత్రం తమను పట్టిపీడిస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు. కాగా బుధవారం కూడా అనేక జిల్లాల్లో రైతులు కరెంట్ కోతలకు నిరసనగా రోడ్డెక్కారు.
సబ్స్టేషన్లను ముట్టడించారు. రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం గుర్రాల సోఫా, వీరానగర్ చౌరస్తాల వద్ద వందలాది మంది రైతులు రోడ్డును దిగ్బంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో మూడు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రామారం, గొల్లపల్లి, సయ్యద్‌నగర్, వడ్డేపల్లి, దొడ్లపల్లి, వీరారెడ్డిపల్లి రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. విద్యుత్తు అధికారులు వచ్చి కరెంట్ సరఫరాపై స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు పురుగుల మందుల డబ్బాలు చేత పట్టుకుని ధర్నా చేపట్టారు. పోలీసులు వచ్చి రైతుల వద్ద ఉన్న పురుగుల మందు డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు. తుక్కాపూర్ ఏడీ మధుసూదన్ వచ్చి రైతులను సముదాయించి ధర్నా విరమింపజేశారు. నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉదయం ఏడు గంటలకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ చౌరస్తాలో రైతులు ధర్నాకు దిగారు.

అహ్మదీపూర్, దిలాల్పూర్, శేర్పల్లి గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, సర్పంచ్‌లు బ్యాగరి ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. కనీసం ఏడు గంటలు కూడా నిరంతరాయంగా కరెంట్‌ను ఇవ్వకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ సబ్‌స్టేషన్ వద్ద రైతులు నిరసన తెలిపారు. అనంతరం శివాజీ చౌరస్తా వద్ద మూడు గంటలకుపైగా రోడ్డుపై బైఠాయించారు.
6 గంటలకు మించి కరెంటు రావడం లేదని మండిపడ్డారు. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా మోటర్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయని వాపోయారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సిరిపుర సబ్‌స్టేషన్ వద్ద తెల్లరాళ్లతండా, సిరిపుర రైతులు, వడ్డ్డేపల్లి సబ్‌స్టేషన్ వద్ద చింతల్చెరు రైతులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ట్రాన్స్‌కో సీఎండీతో మాట్లాడారు. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చండూర్ సబ్‌స్టేషన్‌ను రైతులు ముట్టడించారు. చండూర్లో లైన్మెన్ను నిలదీశారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పాంబండ సబ్‌స్టేషన్ వద్ద రైతులు నిరసన తెలిపారు.

కాలిన మోటర్లతో నిరసన
లోవోల్టేజీ సమస్యతో మోటర్లు కాలిపోతున్నాయని ఆగ్రహిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం రైతులు రోడ్డెక్కారు. కాలిపోయిన వ్యవసాయ బోరు మోటర్లతో గ్రామంలోని సిరిసిల్ల-నిమ్మపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించారు. సుమారు రెండు గంటలపాటు ధర్నా చేశారు. అక్కడికి వచ్చిన అధికారులను నిలదీశారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల, నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం మందిపల్లి సబ్స్టేషన్లను రైతులు ముట్టడించారు. వ్యవసాయానికి కరెంట్ సక్రమంగా ఇవ్వడం లేదని అక్కడి సిబ్బంది నిలదీశారు. సూర్యాపేట జిల్లా కోదాడ సబ్‌స్టేషన్ ఎదుట అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు బొల్లు ప్రసాద్ నాయకత్వంలో రైతులు సబ్‌స్టేషన్ ఎదుట ట్రాక్టర్లు అడ్డుగా పెట్టి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బొల్లు ప్రసాద్ మాట్లాడుతూ.. ఎడాపెడా విద్యుత్తు కోతలు విధించడంతో పొలాలకు నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు కోతలను నిరసిస్తూ యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల, గుడిమల్కాపురం గ్రామాలకు చెందిన రైతులు చిమిర్యాల సబ్‌స్టేషన్ వద్ద బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద, భిక్కనూరు మండలాల్లో రైతులు ఆందోళనకు దిగారు. 12 గంటలైనా కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని దౌల్తాపూర్ రైతులు బిచ్కుంద సబ్‌స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కాగా భిక్కనూరు మండలం ఇసన్నపల్లి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు.
కరెంట్ కోతల్లేవ్!

రాష్ట్రంలో డిమాండ్ అమాంతం పెరిగినా కోతల్లేకుండా విద్యుత్తు సరఫరా చేస్తున్నం. వినియోగదారులకు ఇబ్బందుల్లేకుండా కరెంట్ సరఫరా చేస్తున్న సంస్థలను, సిబ్బందిని అభినందించాల్సింది పోయి కొందరు విమర్శిస్తున్నరు. వ్యవసాయానికి 8-9 గంటలు కూడా విద్యుత్తు సరఫరా కావడం లేదనేది సరికాదు. విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించే ఆలోచన లేదు.
– మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి
భవిత కోసం బాంచెన్ కాల్మొక్త
కరెంటు కోతలపై యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాలలో విద్యుత్తు సబ్‌స్టేషన్ వద్ద బుధవారం బతుకమ్మ ఆడి నిరసన తెలుపుతున్న రైతులు వ్యవసాయానికి కోతలు లేకుండా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి చౌరస్తా వద్ద రాస్తారోకో చేస్తున్న రైతులు.. ‘కరెంట్ ఇచ్చి పంటలు కాపాడుండ్రి సారూ’ అంటూ ట్రాన్స్‌కో అధికారుల కాళ్లు మొక్కుతున్న రైతు నాగరాజు

ఏడు గంటల కరెంట్ కూడా చేతకాదా?
సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లోని సబ్‌స్టేషన్ వద్ద బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు కలిసి మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. పంటలు చేతికొచ్చే దశలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి 7గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో పుష్కలంగా సాగునీటితో పాటు 24గంటల ఉచిత విద్యుత్తు పంటలకు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కార్ 24గంటల కరెంట్‌కు ఎగనామం పెట్టిందని మండిపడ్డారు.
కాలిన మోటర్లు, ఎండిన పంటతో నిరసన
కరెంట్ కోతలపై కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ రైతులు ఆగ్రహించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్ – జగిత్యాల జాతీయ రహదారిపై ధర్నా చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొత్త జయపాల్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొని, మాట్లాడారు. 12 గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.

కరెంట్ కోసం కాళ్లు మొక్కిన రైతు
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి చౌరస్తా వద్ద మెదక్-చేగుంట ప్రధాన రహదారిపై రైతులు గంటకు పైగా రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పంటలు ఎండిపోతున్నాయి సారు, కరెంటు ఇవ్వండి అంటూ చెన్నెపల్లికి చెందిన రైతు నాగరాజు ట్రాన్స్‌కో అధికారుల కాళ్లు మొక్కాడు. చిన్నశంకరంపేట ఎస్సై శివానందం, ట్రాన్స్‌కో ఏఈ నచ్చజెప్పినా రైతులు విన్పించుకోలేదు. ఏడీ మోహన్‌బాబు వచ్చి రైతులను సముదాయించారు.
రైతు ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ చౌరస్తాలో రైతులు ధర్నాకు దిగారు. అహ్మదీపూర్, దిలాల్పూర్, శేర్పల్లి గ్రామాలకు చెందిన రైతులు తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు, బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ తదితరులు వారికి మద్దతుగా నిరసన చేపట్టారు.
24 గంటల కరెంటిస్తున్నామన్న భట్టి… ఐదారు గంటలు కూడా వస్తలేదంటున్న రైతులు ఎడాపెడా కోతలపై భగ్గుమన్న అన్నదాత.. పంటలెండుతున్నా సర్కార్‌కు పట్టదా? లోవోల్టేజీ సమస్య కానరాదా?.. జిల్లాల్లో సబ్స్టేషన్ల ముట్టడి, రాస్తారోకోలు







