నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు శ్రీశైలం ఖాళీ!
అనుమతులు లేవు. వాటాలు తేలలేదు. అయినా ఏపీ అక్రమంగా మళ్లిస్తున్నా నోరుమెదపలేదు. అడ్డుకున్నది లేదు. బోర్డును నిలదీసింది లేదు. అప్పుడే శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ అయ్యింది. అత్యంత కనిష్ఠస్థాయికి నీటిమట్టం చేరుకున్నది. రిజర్వాయర్‌లో కేవలం 34 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నది. ఇప్పుడు నీళ్లు లేవు. కరువు నెలకొన్నదంటూ కాంగ్రెస్ సర్కార్ మొత్తుకుంటున్నది. నీళ్లన్నీ ఏపీకి సద్దికట్టి.. ఇప్పుడు పొదుపు చేయాలంటూ మన రైతాంగానికి సుద్దులు చెబుతున్నది.
- వినియోగానికి ఉన్నవి 34 టీఎంసీలే..
- నీటిసంక్షోభం తలెత్తే దుర్భర పరిస్థితి
- తెలంగాణకు ఎదురవనున్న గడ్డుకాలం
- గ్రేటర్ సహా 10 జిల్లాలు తాగునీటికి తండ్లాటే
- ఏపీ ఒక్కటే 62టీఎంసీల తరలింపు
- అనుమతుల్లేకుండానే నీళ్ల మళ్లింపు
- రేవంత్ సర్కార్ వైఫల్యం..
- నీళ్లన్నీ అయిపోయాక బోర్డు మీటింగ్
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): అనుమతులు లేవు. వాటాలు తేలలేదు. అయినా ఏపీ అక్రమంగా మళ్లిస్తున్నా నోరుమెదపలేదు. అడ్డుకున్నది లేదు. బోర్డును నిలదీసింది లేదు. అప్పుడే శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ అయ్యింది. అత్యంత కనిష్ఠస్థాయికి నీటిమట్టం చేరుకున్నది. రిజర్వాయర్‌లో కేవలం 34 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నది. ఇప్పుడు నీళ్లు లేవు. కరువు నెలకొన్నదంటూ కాంగ్రెస్ సర్కార్ మొత్తుకుంటున్నది. నీళ్లన్నీ ఏపీకి సద్దికట్టి.. ఇప్పుడు పొదుపు చేయాలంటూ మన రైతాంగానికి సుద్దులు చెబుతున్నది.
ప్రభుత్వ వైఫల్యం ఫలితంగా ఈ ఏడాది తీవ్ర నీటిసంక్షోభం తలెత్తే దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. సూపర్ ఎల్ నినో పరిస్థితుల్లోనూ ఏపీ సర్కార్ ఇష్టారీతిన నీళ్లు తరలించడం, తెలంగాణకు నీటి వినియోగంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ దుస్థితికి కారణమని నిపుణులే తేల్చి చెప్తున్నారు. రిజర్వాయర్ నుంచి ఇరు రాష్ర్టాలు వినియోగించిన జలాల గణాంకాలే ఆ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. మున్ముందు కూడా తెలంగాణకు నీటి కష్టాలు తప్పేలా లేదు.
ఇంత జరుగుతున్నా కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఇంతకాలం చోద్యం చూసి, ఇప్పుడు బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించడం కొసమెరుపు. ఎగువన జూరాలకు వచ్చిన జలాలను ఒడిసిపట్టడంలో రేవంత్ సర్కార్ తీవ్ర వైఫల్యం చెందింది. దీంతో అక్కడి జలాలు దిగువన శ్రీశైలం రిజర్వాయర్‌కు వచ్చి చేరాయి. ఇదే అదునుగా ఏపీ సర్కార్ కృష్ణా జలాల దోపిడీకి పూనుకున్నది. జూన్1 నాటికి శ్రీశైలంలో కేవలం 40 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.
రిజర్వాయర్‌కు జూలై చివరివారం నుంచి వరద ప్రవాహాలు మొదలయ్యాయి. ఆగస్టు రెండోవారం వచ్చేసరికి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 185 టీఎంసీలకు చేరుకున్నది. ఈ సీజన్లో అదే అత్యంత గరిష్ఠ నీటిమట్టం. వరద ప్రవాహం ప్రారంభంకాగానే ఏపీ సర్కార్ నీటి మళ్లింపు ప్రక్రియను వేగవంతంగా చేపట్టింది. పోతిరెడ్డిపాడుతోపాటు ఇతర లిఫ్ట్‌ల నుంచి నీటి మళ్లింపు చేపట్టింది. అంతేకాదు.. కరువు పరిస్థితులున్న కూడా వెలిగొండ ప్రాజెక్టును సైతం నూతనంగా ప్రారంభించి జలాల మళ్లింపును చేపట్టింది. మొత్తంగా ఏపీ ఒక్కటే శ్రీశైలం నుంచి 56 టీఎంసీలకు పైగా జలాలను మళ్లించింది.
ఏపీ రెట్టింపు జలాల మళ్లింపు
లెక్కల్లో చూపిన దానికి రెట్టింపు జలాలను శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ నీటిని మళ్లించిందని ఆధారాలే చెప్తున్నాయి. వాస్తవంగా శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఏపీకి ఉన్న కేటాయింపులు కేవలం 34 టీఎంసీలు. కానీ అంతకు మించి జలాలను ఆ రాష్ట్రం తరలించినట్టు లెక్క చెప్తున్నది. క్షేత్రస్థాయిలో అంతకు మించి తరలించినట్టు అధికారవర్గాలే వివరిస్తున్నాయి. ఎగువన జూరాల నుంచి, మరోవైపు తుంగభద్ర నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు వచ్చిన జలాలు, ఇరు రాష్ర్టాల వినియోగాలు, నిల్వల గణాంకాల్లోనూ భారీ వ్యత్యాసం ఉన్నది. మరో 35టీఎంసీలు లెక్కల్లోకి రాని పరిస్థితి ఏర్పడింది. కృష్ణా జలాలను ఏపీ ఏకంగా 750 కి.మీ. దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గం వరకు తరలించింది.
రేవంత్ సర్కార్ వైఫల్యం!
రేవంత్ సర్కార్ వైఫల్యంతోనే ఏపీ ఇబ్బడి ముబ్బడిగా నీటిని తరలింపు సాధ్యమైందని సాగునీటి రంగ నిపుణులు, రైతు ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అనుమతులకు విరుద్ధంగా జలాలను తరలిస్తున్నా ఏపీని నిలువరించకుండా పరోక్ష సహకారం అందించిందని చెప్తున్నారు. తెలంగాణ శ్రీశైలం నుంచి వినియోగించిన జలాలు గతంలో ఎన్నడూ లేనంతంగా కనిష్ఠంగా వాడుకోవడమే ఇందుకు నిదర్శనం. ఉన్న ఒక్క కల్వకుర్తి ద్వారా కేవలం 12 టీఎంసీలు మాత్రమే వినియోగించడం కాంగ్రెస్ సర్కార్ అసమర్థతను పట్టిచూపుతున్నది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద రిజర్వాయర్లను, కాలువలతో అనుసంధానించిన వందలాది చెరువులను నింపే అవకాశం ఉన్నా.. దానికోసం రేవంత్ సర్కార్ కనీస ప్రయత్నం చేయలేదు.
తెలంగాణకు గడ్డు పరిస్థితులే..
శ్రీశైలంలో నీటినిల్వలు వేగంగా తగ్గిపోవడంతో తెలంగాణకు తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదురవనున్నాయని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావం మరింత ప్రభావం చూపుతుందని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది. శ్రీశైలంపై మహబూబ్‌నగర్ సహా 7 జిల్లాలు, నాగార్జున సాగర్‌పై ఆధారపడిన నల్లగొండ జిల్లా, హైదరాబాద్ నగరానికి తాగునీటి కోసం ఆధారపడి ఉన్నాయి. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కావాల్సిన 16.5 టీఎంసీలను శ్రీశైలం రిజర్వాయర్ నుంచే విడుదల చేయా ల్సి ఉన్నది. ప్రస్తుతం శ్రీశైలంలో 40 టీఎంసీలే అందుబాటులో ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో ఎండీడీఎల్ స్థాయితో పోల్చితే 50 టీఎంసీలను మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఆ రెండు రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న నీళ్లను ఏపీ ఖాళీ చేస్తే మున్ముందు తెలంగాణ ఆధారిత జిల్లాలకు తాగునీటి సంకటం తప్పదనే సంకేతాలు భయాందోళన కలిగిస్తున్నాయి.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

