తెలంగాణ ఇంజినీర్లపైనే వేటు ఆంధ్రా వారికి రెడ్‌కార్పెట్!
స్వరాష్ట్రం సిద్ధించి పుష్కరకాలం దాటినా కొన్నిచోట్ల ఇంకా ఆంధ్రా ప్రాంత ఆధిపత్యం కొనసాగుతూనే ఉన్నది. స్వరాష్ర్టానికి చెందిన విద్యుత్తు సంస్థల్లో ఆంధ్రా అధికారులే ఇప్పటికీ పెత్తనం చెలాయిస్తున్నారు. వారి వివక్షకు తెలంగాణ బిడ్డలే బలి పశువులు అవుతున్నారు.
- వైటీపీఎస్ ప్లాంట్‌లో ఆంధ్రా అధికారుల ఆధిపత్యం
- తాజాగా తెలంగాణకు చెందిన స్టేజ్-1 సీఈ సురేశ్ సస్పెండ్
- ఆంధ్రా అధికారికి ఈడీగా ప్రమోషన్
- మండిపడుతున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీర్లు, ఉద్యోగులు
హైదరాబాద్, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ)/: స్వరాష్ట్రం సిద్ధించి పుష్కరకాలం దాటినా కొన్నిచోట్ల ఇంకా ఆంధ్రా ప్రాంత ఆధిపత్యం కొనసాగుతూనే ఉన్నది. స్వరాష్ర్టానికి చెందిన విద్యుత్తు సంస్థల్లో ఆంధ్రా అధికారులే ఇప్పటికీ పెత్తనం చెలాయిస్తున్నారు. వారి వివక్షకు తెలంగాణ బిడ్డలే బలి పశువులు అవుతున్నారు. తెలంగాణ వ్యతిరేకులు, ఆంధ్రా ప్రాంతం వారికి మాత్రం ఆ సంస్థల్లో రెడ్‌కార్పెట్ పరుస్తున్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)లో ఇప్పుడు ఇదే తంతు జరుగుతున్నది. తెలంగాణకు చెందిన ఆ ప్లాంట్ స్టేజ్-1 చీఫ్ ఇంజినీర్ బీ సురేశ్‌ను జెన్కో యాజమాన్యం బుధవారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు జెన్కో సీఎండీ హరీశ్ ఉత్తర్వులు జారీచేశారు.
సురేశ్ సస్పెన్షన్‌పై తెలంగాణ ఇంజినీర్లు, ఉద్యోగులు భగ్గుమన్నారు. జెన్కో యాజమాన్యం చర్యలను తీవ్రంగా నిరసిస్తున్నారు. జెన్కో థర్మల్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, యాదాద్రి డిజైన్లు ఖరారు చేసిన థర్మల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ సీఈగా పీవీ శ్రీనివాస్, ఇదే యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో స్టేజ్-2 సీఈగా సూర్యనారాయణ పనిచేస్తున్నారు. వీరంతా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. ప్లాంట్ నడువకున్నా, ఏవైనా లోపాలున్నా వీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోని యాజమాన్యం, తెలంగాణ అధికారిపైనే ఎలా వేటు వేస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రా ప్రాంతీయులను పక్కనపెట్టి.. ఒకే ఒక్క తెలంగాణ బిడ్డ సురేశ్‌ను ఎలా సస్పెండ్ చేస్తారని నిలదీస్తున్నారు. చర్యలు తీసుకునే ముందు షోకాజ్ నోటీసు ఇవ్వాలి. లిఖితపూర్వక వివరణ కోరాలి. సదరు ఇంజినీర్ ఇచ్చిన వివరణ సవ్యంగా లేకపోతేనే చర్యలు తీసుకోవాలి. కానీ, ఇవీమీ లేకుండానే సీఈ సురేశ్‌పై చర్యలు తీసుకున్నారని ఈ ప్రాంత ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు.
ఆంతా ఆంధ్రామయం
టీజీ జెన్కో సంస్థ కీలక స్థానాల్లో మొత్తం ఆంధ్రా అధికారులదే హవా సాగుతున్నది. డైరెక్టర్లల్లో ఇద్దరు ఆంధ్రా ప్రాంతంవారే. సింగరేణి సంస్థలో పనిచేసిన వ్యక్తిని ఇక్కడ డైరెక్టర్‌గా నియమించారు. కాకతీయ థర్మల్ ప్లాంట్, శ్రీశైలం, కొత్తగూడెం 5,6,7 ప్లాంట్లలోని కీలక స్థానాల్లోనూ ఆంధ్రావాళ్లే ఉన్నారు. జెన్కో చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, ఎస్ఈ అడ్మినిస్ట్రేషన్, సీఈ, ఎస్ఈ పోస్టుల్లో 90 శాతం ఏపీ వాళ్లే. సీఈ థర్మల్, థర్మల్ ప్లాంట్స్ కన్స్ట్రక్షన్స్ సీఈలంతా ఆంధ్రా అధికారులే. థర్మల్‌లో ఇద్దరు, హైడల్‌లో ఒకరి చొప్పున మాత్రమే తెలంగాణ సీఈలు ఉన్నారు. వైటీపీఎస్ విషయంలో జెన్కో డైరెక్టర్ ఒకరిది వన్‌మ్యాన్ షోగా నడుస్తున్నది. జెన్కోలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల పనులకు సీఈ స్థాయిలోనే ఓపెన్ టెండర్లు ఆహ్వానించి ఖరారు చేయడం ఆనవాయితీ. కానీ, ఇప్పుడు రూ.15 వేల పనులకూ సదరు పెద్ద అధికారి ఆమోదం తప్పనిసరి చేశారు.
అత్యవసర పనులకు కొనుగోళ్లను సైతం తానే లాక్కున్నారట. ప్రొఫ్రైటర్ల ద్వారా సామగ్రి కొనకుండా ఇతర కంపెనీలవి అంటగడుతున్నారని ఆరోపణలున్నాయి. గతంలో తెలంగాణకు చెందిన సీఈ సమ్మయ్యకు ఈడీగా ప్రమోషన్ కల్పించాల్సి ఉండగా, ఇందుకు సంబంధించిన ఫైల్‌ను తొక్కిపెట్టిన యాజమాన్యం, ఇప్పుడు ఏకంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన థర్మల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ సీఈగా ఉన్న పీవీ శ్రీనివాస్‌కు దొడ్డిదారిలో ప్రమోషన్ కల్పించి ఈడీగా నియమించింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్తు ఉద్యోగులు.. కాంగ్రెస్ పాలనలో తమకు ప్రాధాన్యం దక్కకపోవడం, ఆంధ్రా అధికారులకే అవకాశాలు వస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆంధ్రా అధికారుల తీరు మారకుంటే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని వారు ఈ మేరకు హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

