నారాయణపేట రూరల్, ఏప్రిల్ 6: హాస్టల్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మెనారిటీ గురుకుల హాస్టల్‌ను సోమవారం పలు విద్యార్థి సంఘాల నాయకులు సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయుడు సిరాజుద్దీన్ హాస్టల్లో 9వ తరగతి విద్యార్థులు రాత్రి పడుకొన్న సమయంలో బట్టలు విప్పడం, తొడలు గిల్లడం వంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని తెలిపారు. నైట్ డ్యూటీ చేసే సమయంలో ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడని వాపోయారు. ఉపాధ్యాయుడు సిరాజుద్దీన్ తీరుపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు ఉపాధ్యాయుడితోపాటు అతడి తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్న ప్రిన్సిపాల్ ఖాజామైనుద్దీన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.