గుండె చెదరొద్దు..! పరుగు ప్రాక్టిస్పై ప్రణాళిక లేకే ప్రాణాలు కోల్పోతున్నారు
ఖాకీ యూనిఫాం అంటే యువతకు ఎంతో క్రేజ్. పోలీస్ ఉద్యోగం సాధించి సమాజ రక్షకులుగా నిలిచేందుకు పోటీపడుతుంటారు. అందుకే ఖాకీ కొలువుల కోసం జీవితాలను పణంగా పెట్టి ప్రాక్టీస్ చేస్తుంటారు.
- పోలీస్ కొలువు వేటలో ఆగుతున్న యువ హృదయాలు
- పరుగు ప్రాక్టిస్పై ప్రణాళిక లేకే ప్రాణాలు కోల్పోతున్నారంటున్న నిపుణులు
- క్రమబద్ధంగా సాధన చేస్తే 15 రోజుల్లోనూ విజయం ఖాయమని సూచన
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ):సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన ఖాజా మొహినుద్దీన్ కుమారుడు 26 ఏండ్ల అఫ్సర్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని మరీ పోలీస్ కావాలన్న తన కల నిజం చేసుకొనేందుకు వచ్చాడు. ఎస్సై కొలువు సాధించాలన్న లక్ష్యం కోసం పరుగెడుతూ.. గుండెపోటుతో ఈనెల 16న హఠాన్మరణం పొందాడు.
సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన 25 ఏండ్ల యువకుడు శ్రీకాంత్ ఇటీవల నిర్వహించిన ఎస్సై ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించాడు. దేహదారుఢ్య పరీక్షల కోసం స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాల మైదానంలో పరుగు తీస్తూ మంగళవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే గుండెపోటుతో మరణించాడు.
ఖాకీ యూనిఫాం అంటే యువతకు ఎంతో క్రేజ్. పోలీస్ ఉద్యోగం సాధించి సమాజ రక్షకులుగా నిలిచేందుకు పోటీపడుతుంటారు. అందుకే ఖాకీ కొలువుల కోసం జీవితాలను పణంగా పెట్టి ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే కొలువు సాధనలో గెలుపు కోసం దేహదారుఢ్య పరీక్షలకు సన్నద్ధం తప్పనిసరి. అదే సమయంలో వారి శరీరతత్వం, బలాలు, బలహీనతలు అంచనా వేయకుండానే శక్తికి మించి సాధన చేయడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రిలిమ్స్ కోసం నెలల తరబడి కూర్చుని చదివిన యువత ఒక్కసారిగా వ్యాయామాలు పెంచడం కూడా సమస్యకు కారణం అవుతున్నది. అయితే ప్రణాళిక ప్రకారం క్రమంగా సాధన చేస్తే పదిహేను రోజుల్లోనూ ఫిజికల్ ఈవెంట్స్‌లో సక్సెస్ కావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కనీస అవగాహన, క్రమపద్ధతిలో వ్యాయామంతో గుండెలు చెదరకుండా చిరునవ్వుతో లక్ష్యాలను చేరుకోవచ్చని పలువురు డాక్టర్లు సూచిస్తున్నారు. పోలీస్ కొలువు గెలిచేందుకు గుండెను ఎలా దిటువు చేసుకోవాలో ఓసారి తెలుసుకుందాం..
ఇలా చేద్దాం.. గెలిచి నిలుద్దాం
- శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. చలికాలం అయినా నీరు తాగే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అవసరం మేరకు గ్లూకోజ్ వా టర్ను వెంట పెట్టుకోవడం ఉత్తమం.
- సాధన చేస్తున్నప్పుడు సమతుల ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, పాలు, ఉడికించిన గుడ్లు, శెనగలు, బెల్లం వంటి బలవర్ధక ఆహారం తీసుకోవాలి.
- సాధన సమయంలో ఈవెంట్స్‌కు ముందు వైద్యుడిని సంప్రదించాలి. ముందస్తుగా ఈసీజీ, ఇతర హృదయ సంబంధ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
- మద్యం, సిగరెట్ అలవాటు ఉంటే వాటిని వదులుకోవాలి. ధూమపానం అలవాటు ఉన్నవారు శ్వాసకు సంబంధించి సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువ ఉంటుంది.
- గుండెలో నొప్పిగా ఉన్నా, ఛాతిలో నొప్పిగా అనిపించినా వెంటనే పరుగు ఆపేయాలి. విశ్రాంతి తీసుకోవాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదు.
- పరుగు పూర్తికాగానే వెంటనే నీటిని తాగకూడదు.
సాధన చేద్దాం ఇలా..
- పోలీస్ కొలువులకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షల్లో పరుగు కీలకమైంది. ఇందుకు ఒకేసారి తాహతు మించిన కసరత్తు చేయవద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఆర్ఐ సిద్ధార్థ తెలిపారు.
- యూట్యూబ్‌లో చూసి.. లేదంటే సరైన అవగాహన లేనివారి నుంచి సలహాలు తీసుకుని ప్రాక్టీస్ చేయవద్దు.
- శరీరతత్వం ఆధారంగా ముందుగా వామ్అప్, స్ట్రెచ్చింగ్, స్ట్రెంతెన్ పద్ధతిలో క్రమంగా సాధన పెంచుతూ పోవాలి.
- పక్కా ప్రణాళికతో వెళితే పదిహేను రోజుల్లోనూ విజయం సాధించవచ్చు. ముందుగా వారం రోజులు తక్కువ వేగంతో ఎక్కువ దూరం పరుగెత్తాలి.
- బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, యోగా ద్వారా శ్వాసపై నియంత్రణ పెంచుకోవచ్చు.
- ఆహారపు అలవాట్లు, రోజువారీ పనులు ప్రణాళిక ప్రకారం ఉండేలా చూడాలి. రాత్రి తగినంత నిద్ర పోవాలి. బలవర్ధకంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
- ఖాళీ కడుపుతో ఎక్కువదూరం పరుగెత్తవద్దు. నానపెట్టిన బాదం, గ్లూకోజ్ వాటర్, చిక్కీలు, వంటివి వెంట పెట్టుకుని తింటూ ఉంటే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.
- ఒకేసారి ఎక్కువ గంటలు సాధన చేయవద్దు. ఉదయం, సాయత్రం ప్రాక్టీస్ చేయాలి. ప్రారంభానికి ముందు, ముంగించే ముందు బాడీ రిలాక్స్అయ్యే ఎక్సర్సైజ్లు, స్ట్రెచ్చింగ్స్ చేయాలి. దీనివల్ల శరీరానికి అలసట తగ్గుతుంది.
చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు
పోలీస్ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షల్లో భాగంగా ఈవెంట్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో కొందరు గుండెపోటుకు గురవుతుండటం బాధాకరం. చి న్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. చిన్న వయసులోనే వారికి గుండెపోటు రావడానికి ప్రధానంగా 3 కారణాలు ఉంటాయి.
యూనిఫాం సర్వీస్ లక్ష్యంగా ఉన్నవారు వ్యాయామాలు చే స్తుంటారు. దానికి తగ్గట్టే రక్తం పంపిణీ చేసేలా గుండె కండరాలు సిద్ధం అవుతా యి. అయితే.. రాతపరీక్ష కోసం వారు కొన్ని నెలలపాటు కూర్చొని చదివి ఉంటారు. ఆ సమయంలో వ్యాయామంపై దృష్టి పెట్టరు. దీంతో గుండెకు పనితగ్గి కండరాలు సాధారణ స్థితికి వస్తాయి. దీనిని డీకంపోజ్ అంటాం. ఈ విషయం తెలియక ఈవెంట్స్ కోసం కొందరు ఒక్కుమ్మడిగా కఠిన వ్యాయామాలు మొదలుపెడతారు. దీంతో గుండెపై ఏకబిగిన ఒత్తిడి పెరుగుతుంది.
చలికాలంలో తెల్లవారుజామున రక్తనాళాలు కాస్త కుచించుకుపోయి ఉంటాయి. శరీరం వేడెక్కి రక్తనాళాలు వ్యాకోచించేవరకు చిన్నచిన్న వ్యా యామాలు చేయాలి. అలాకాకుండా లేచిన వెంటనే కఠిన వ్యాయామాలు చేస్తే గుండె రక్తాన్ని వేగంగా పంపింగ్ చేసినా.. రక్తనాళాల ద్వారా వెళ్లలేదు. దీంతో గుండె పనితీరుపై ప్రభావం పడుతుంది.
ఆధునిక జీవన విధానం, ఆహా ర అలవాట్ల వల్ల చిన్న వయసులోనే రక్తపోటు, మధుమేహ సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసు కారణంగా లక్షణాలు కనిపించక అభ్యర్థుల్లో కొందరికి ఆ విషయం కూడా తెలియదు. వారు తమ శక్తికి మించి వ్యాయామాలు చేయడం గుండెకు ప్రమాదకరం.
ఇలా చేయండి..
అభ్యర్థులు గతంలో ఎంత కఠినమైన వ్యాయామాలు చేసి ఉన్నా.. ఇప్పుడు ఈవెంట్స్‌కు సిద్ధం అయ్యేటప్పుడు కనీసం వారం రోజులపాటు సులభమైన వ్యాయామాలు చేయాలి. తద్వారా శరీరం.. ముఖ్యంగా గుండె గతంలో మాదిరిగా సిద్ధమవుతుంది.
ఉదయం పూట రన్నింగ్, ఇతర వ్యాయామాలు చేసేవారు కనీసం 10-15 నిమిషాలు కచ్చితంగా వామ్అప్ చేయాలి. అప్పుడే రక్తనాళాలు వ్యాకోచించి, తగినంత రక్త సరఫరాకు సిద్ధమవుతాయి.
పరుగును ఒకేసారి వేగంగా ప్రారంభించొద్దు. నెమ్మదిగా ప్రారంభించి వేగాన్ని అందుకోవాలి. ఒకేసారి పరుగును ఆపొద్దు. నెమ్మదిగా వేగాన్ని తగ్గించాలి. అప్పుడే శరీర కదలికలకు తగినట్టుగా గుండె సమన్వయం చేసుకోగలుగుతుంది. – ప్రొఫెసర్ ఆర్వీ కుమార్, గుండె శస్త్రచికిత్స విభాగాధిపతి, నిమ్స్ హాస్పిటల్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

