హైదరాబాద్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ): పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు విస్తీర్ణం 6.2 లక్షల ఎకరాల నుంచి 20 లక్షల ఎకరాల మేర వచ్చే యాసంగిలో పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కేవలం 1.62 లక్షల ఎకరాలకు మాత్రమే సబ్సిడీ విత్తనాలను అందించాలని నిర్ణయించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. లక్ష్యానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోకపోవడంపై రైతాంగం నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కరువు పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ సర్కార్ కనికరించడం లేదనే విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.
ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆరుతడి పంటలనే సాగు చేయాలంటూ పిలుపునిస్తున్న ప్రభుత్వం.. అందుకు తగ్గట్టుగా ప్రోత్సాహకాలు అందించడంలేదంటూ విమర్శిస్తున్నారు. ఆర్భాటపు ప్రకటనలే తప్ప సబ్సిడీ విత్తనాలు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు ముం దుకు రాకపోవడంపై మండిపడుతున్నారు. రైతుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల్లో భాగంగా తూతూ మంత్రంగా రాయితీ విత్తనాలు అందిస్తూ చేతులు దులిపేసుకుంటున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సర్కార్ మాటలు విన్న రైతులు అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే కరువుతో కష్టాల్లో ఉన్నామని, కనీసం ఇలాంటి సమయంలోనూ ప్రభుత్వం సబ్సిడీలో విత్తనాలు అందజేసి ఆందుకోవాలని కోరుతున్నారు.
నిరుడు పప్పు, నూనె గింజల పంటలు కలిపి సుమారు 6.2 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగయ్యాయి. ఈసారి ఆ విస్తీర్ణాన్ని కనీసం 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాలకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అందుకు తగ్గట్టుగా సబ్సిడీ విత్తనాలు అందించడానికి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సబ్సిడీ విత్తనాలకు మొత్తం కేటాయింపులు రూ.58.76 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కేవలం రూ. 22.84 కోట్లు మాత్రమే. కేవలం కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా సబ్సిడీలో విత్తనాలు అందిస్తున్నట్టుగా హంగామా చేస్తున్నది. ఈ మేరకు శనివారం సబ్సిడీ విత్తనాలను విడుదల చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గొప్పగా ప్రకటించారు. కానీ, రైతులందరికీ, మొత్తం విస్తీర్ణానికి సబ్సిడీ విత్తనాలు అందిస్తున్నారనుకుంటే పొరపాటే. కేవలం 1.62 లక్షల ఎకరాలకు మాత్రమే అందించాలని నిర్ణయించడం గమనార్హం.
‘తాంబూలం ఇచ్చాం.. తన్నుకు చావండి’ అన్న విధంగా ప్రభుత్వం తీరు ఉన్నది. చాలా పరిమిత సంఖ్యలో సబ్సిడీ విత్తనాలు అందిస్తూ రైతుల మధ్య గొడవలు పెడుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 7 రకాల విత్తనాలనే అందించాలని నిర్ణయించింది. అది కూడా ఎంపిక చేసిన జిల్లాల్లో ఎంపిక చేసిన రైతులకే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వేరుశనగ 28,260 క్వింటాళ్లు, కుసుమ 160 క్వింటాళ్లు, పొద్దు తిరుగుడు 112 క్వింటాళ్లు, నువ్వులు 148 క్వింటాళ్లు, శనగలు 26,846 క్వింటాళ్లు, మినుములు 1,369 క్వింటాళ్లు, పెసలు 793 క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా వేరుశనగ నిరుడు 2.51 లక్షల ఎకరాల్లో సాగైతే ఇప్పుడు కేవలం 35 వేల ఎకరాలకే సబ్సిడీ విత్తనాలు అందించాలని సర్కార్ నిర్ణయించింది. వీటిలో ఏ విత్తనాలను ఏ జిల్లాలో పంపిణీ చేయాలనే అంశంపై క్లస్టర్లుగా విభజించింది. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనలతో అవసరమైన రైతులకు సబ్సిడీ విత్తనాలు అందే పరిస్థితి లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ సర్కార్ మాటలు కోటలు దాటుతుండగా, చేతలు మాత్రం పొలం మడి దాటడం లేదని రైతులే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎల్ నినో వంటి కరువు పరిస్థితుల్లోనైనా తమపై కనికరం చూపించడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికే అనాలోచిత నిర్ణయాలు, కక్షసాధింపు రాజకీయాలతో వానకాలం సాగు నీళ్లను వదిలేసి.. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కరువు తీసుకొచ్చిందనే ఆరోపణలున్నాయి. తద్వారా రైతుల గోస పుచ్చుకుంటున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ యాసంగిలోనైనా సర్కార్ రైతులను ఆదుకోవాలనే ఆలోచన చేయకపోవడంపై విమర్శలున్నాయి. ఓవైపు ఆరుతడి పంటలు వేయాలని చెప్తున్న సర్కార్.. అందుకు అవసరమైన ప్రోత్సాహం ఎందుకు కల్పించడంలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పంటల సాగును రైతుల ఇష్టానికి వదిలేయకుండా పలానా పంటలనే సాగు చేయాలంటూ రైతులపై ఆంక్షలు విధించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆంక్షలు పెట్టినా ఆ పంటల కొనుగోళ్లపై రైతులకు భరోసా ఇస్తుందా? ఒకవేళ నష్టపోతే ఆదుకుంటుందా? అంటే అవేవీ లేవు. ఇలా రైతులకు ఉచిత సలహాలిస్తూ… వారి పాపానికి వాళ్లను వదిలేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.