రెంజల్, జనవరి 10 : మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అడుగులు పడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు యువకులు నడుం బిగించారు. ఇందులో భాగంగా మంగళవారం నాందేడ్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో ప్రారంభమైన ర్యాలీ దెగ్లూర్ నాకా, ఈద్గా, కడికిపురా, తరొడా నాకా, ఆనంద్‌నగర్ వరకు కొనసాగింది. ప్రధాన కూడళ్లలో నిర్వహించిన సమావేశాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణపై చర్చించారు. అభిమానులు, యువత భారీ సంఖ్యలో తరలివచ్చి బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపడంతోపాటు కేసీఆర్ పిలుపు మేరకు సైనికుల్లా పనిచేసేందుకు చాలామంది మొగ్గు చూపుతున్నట్టు బీఆర్ఎస్ అభిమాని గణేశ్ కదం తెలిపారు.