హైదరాబాద్/చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలో కానిస్టేబుల్ అరుణ్ దర్జాగా నగదు లెకిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడం, మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావడంతో రవాణా శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. అరుణ్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ రవాణా శాఖ కమిషనర్ సోమవారం ఉత్తర్వు లు జారీచేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరపాలని ఉన్నతాధికారులకు స్పష్టంచేశారు. ఆర్టీవో కార్యాలయం లో ప్రైవేట్ ఏజెంట్ల పెత్తనాన్ని అరికట్టడంలో విఫలమయ్యారన్న అభియోగాలతో ఎంవీఐ భీమ్‌సింగ్, ఆర్టీవో రామ్‌చందర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి, రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు.
దళారులకు నోఎంట్రీ
రాష్ట్రంలోని ఆర్టీవో కార్యాలయాల్లో దళారులు, ప్రైవేట్ ఏజెంట్ల ప్రవేశంపై రవాణా శాఖ స్పష్టమైన హెచ్చరికలు జారీచేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఏజెంట్లను లేదా అనధికార వ్యక్తులను కార్యాలయ ప్రాంగణాల్లోకి అనుమతిస్తే ఉపేక్షించేది లేదని, ఇందుకు ఆర్టీవోలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. పౌర సేవలను పారదర్శకంగా అందించాలని, అక్రమ వసూళ్లకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కార్యాలయంలో కానిస్టేబుల్ అరుణ్ నగదు లెక్కిస్తున్న వీడి యో బయటకు రావడంతో ఏసీబీ అధికారు లు సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. అక్కడి అధికారులతోపాటు సిబ్బందిని ప్రశ్నించి, పలు రికార్డులను పరిశీలించారు. కానిస్టేబుల్ అరుణ్ ఎందుకు డబ్బులు లెక్కిస్తున్నాడు? ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? అనే అం శాలపై అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కొందరిపై అనుమానం రావడం తో వారి యూపీఐ లావాదేవీలపై ఆరా తీశామని, మరికొందరి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడిస్తామని రంగారెడ్డి జిల్లా రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు.