హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): 2023-24 బడ్జెట్ అంచనాలను సిద్ధం చేయాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సూచించారు. అంచనాలు రూపొందించి ఆర్థిక శాఖతో పాటు సెక్రటేరియట్‌లోని అడ్మినిస్ట్రేషన్ విభాగానికి అందించాలని పేర్కొన్నారు. పన్నులు, సుంకాలు, రుసుములు తదితర వాటిలో పెరుగుదల, తగ్గుదలలో ప్రభుత్వం ఆమోదించిన రేట్లను ప్రతిపాదనల్లో పొందుపరచాలని సూచించారు. వేతనాలు, అలవెన్సులు, హెచ్ఆర్ఏ, మెడికల్ రీయింబర్స్మెంట్, సెలవులు, ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ ఉద్యోగులకు చెల్లించే వేతనాలన్నీ వివరంగా అందజేయాలని తెలిపారు. ట్రావెల్ అలవెన్స్‌లు, టీఏ, డీఏ వివరాలు క్షుణ్ణంగా పొందపరచాలని పేర్కొన్నారు. పథకాలు, నిధులు, సబ్సిడీలు, లబ్ధిదారులు ఎంతమంది అనే వాటి ప్రకారం బడ్జెట్ అంచనాలు సిద్ధం చేసి పంపాలని సూచించారు. అన్ని శాఖలకు బడ్జెట్ నమూనాను పంపామని, దాని ప్రకారం వివరాలు అందించాలని చెప్పారు. అన్ని శాఖల నుంచి అంచనాలు అందిన తర్వాత ఆర్థిక శాఖ 2023-24 బడ్జెట్‌ను రూపొందించనున్నది.