హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): 104 ఉద్యోగులకు 15నెలల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయూఎంహెచ్‌ఈయూ) డిమాండ్ చేసింది. సోమవారం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు ఎండీ ఫసియుద్దీన్, కే యాదనాయక్ మాట్లాడుతూ.. వైద్యారోగ్యరంగానికి రాష్ట్ర బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కోరారు. వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తాత్సారం చేస్తే ఐక్య పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా భూపాల్, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎండీ ఫసీయుద్దీన్, ప్రధాన కార్యదర్శిగా యాదనాయక్, కోశాధికారిగా వీ భూలక్ష్మి, ఉపాధ్యక్షులుగా కే బలరాం, ఏ కవిత, జే సుధాకర్, వీ విజయవర్ధన్ రాజు, జే కొండల్రావు, ఎస్ హరిశంకర్, రాష్ట్ర కార్యదర్శులుగా ఎస్ నవీన్‌కుమార్, ఎం యాదగిరి, డీ కిరణ్మయి, కే రమేశ్, గిరి, యాదయ్య, ఏం ఆదిత్యలను ఎన్నుకున్నారు.
జీవో 1195 వెంటనే అమలు చేయాలి ; ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్
హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రయోజనానికి జీవో-1195ను అమలు చేయాలని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామరాజేశ్ ఖన్నా సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం జీవో-1195ను విడుదల చేసి 11 నెలలు గడుస్తున్నా నేటికీ ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అందడం లేదని వాపోయారు. ఆగస్టు 15లోగా ఎన్హెచ్ఎం ఉద్యోగులకు కొత్త వేతనాలను అమలులోకి తీసుకురావాలని విజ్ఞప్తిచేశారు.