యథేచ్ఛగా సీఎంఆర్ దందా
రైస్ మిల్లర్ల అక్రమాలకు అంతే లేకుండాపోయింది. కొందరు మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ ధాన్యాన్ని తెగనమ్ముకొని పంచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
- అధికారుల వత్తాసు.. లాభసాటిగా మిల్లర్ల వ్యాపారం
- మిల్లులకు అడ్డగోలుగా ధాన్యం కేటాయింపులు
- నాలుగు కోట్ల విలువ లేని మిల్లులకు 30 కోట్ల ధాన్యం
- సూర్యాపేట జిల్లాలో 35కిపైనే మిల్లులకు 500 కోట్ల విలువైన ధాన్యం కేటాయింపు
- సీఎంఆర్ వచ్చింది 30 % లోపే విచారణచేస్తే వెలుగులోకి రానున్న మరిన్ని అక్రమాలు
సూర్యాపేట, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రైస్ మిల్లర్ల అక్రమాలకు అంతే లేకుండాపోయింది. కొందరు మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ ధాన్యాన్ని తెగనమ్ముకొని పంచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.నాలుగు కోట్ల విలువ చేయని రైస్ మిల్లులకు రూ.15 కోట్ల నుంచి రూ.25 కోట్ల విలువైన ధాన్యం కేటాయించారు. ఇలాంటివి సూర్యాపేట జిల్లాలో దాదాపు 35 వరకు ఉండగా వాటికి గత మూడు సీజన్లలో రూ.500కు పైనే కోట్ల విలువ చేసే ధాన్యం ఇచ్చినట్టు తెలిసింది. వీటి నుంచి సివిల్ సప్లయీస్‌కు రావాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) 30 శాతంలోపే ఉండటం గమనార్హం.
ఇటీవల అధికారులు తనిఖీలు చేసి కేసులు నమోదు చేసిన మిల్లుల్లో రూ.నాలుగు కోట్ల విలువ చేయలేని మిల్లులు ఎనిమిది ఉన్నాయి. మిగిలిన మిల్లులు కూడా ఉండేనా ప్రభుత్వాన్ని నిలువునా ముంచేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ చేస్తే విస్తుగొలిపే అక్రమాలు వెలుగులోకి రావడం ఖాయమని 40 ఏండ్లుగా మిల్లు నడిపిస్తున్న ఓ సీనియర్ మిల్లర్ అంటుండగా, సివిల్ సప్లయీస్‌లో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది సైతం అంతర్గతంగా అక్రమాలు వాస్తవమేనని ధ్రువీకరిస్తున్నారు.
బ్యాంకు రుణాలు.. ప్రభుత్వ ధాన్యం
మిల్లు ఏర్పాటు చేసేందుకు కొద్దిపాటి డబ్బు ఉన్నా మారుమూల ప్రాంతంలో తక్కువ ధరలో భూమిని కొనుగోలు చేస్తారు. దాంట్లో మిల్లు ఏర్పాటు కోసం బ్యాంక్‌కు వెళ్తే వర్కింగ్ కాపిటల్ కోసం కావాల్సినంత రుణం ఇస్తున్నారు. రుణం సులువుగా వస్తుండటంతో అక్రమార్కులు కొంత డబ్బు సేకరించి మిల్లుల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. వారికి అధికారులు తోడుకావడంతో కోట్లాది రూపాయలు కొల్లగొడుతూ పంచుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలా సూర్యాపేట జిల్లా పరిధిలోని పెన్‌పహాడ్ మండలంలో కేసు నమోదై సీజ్ అయిన జేపీ మిల్లు విస్తీర్ణం ఎకరంన్నర ఉండగా చిన్నపాటి గోదాము ఉన్నది. ఈ మిల్లుకు నెలకు రూ.10 వేల కరెంటు బిల్లు కూడా రావడంలేదు.
అలాంటి మిల్లుకు రూ.14 కోట్ల విలువైన ధాన్యాన్ని అధికారులు అప్పగించగా అందులో ఒక్క గింజ కూడా తిరిగి అప్పటించలేదు. గతంలో డీఫాల్ట్ అయిన శివసాయి మిల్లును కొందరు లీజుకు తీసుకొని ధాన్యం మాయం చేశారు. ఇదే బ్యాచ్ పెన్‌పహాడ్, గరిడేపల్లిలో మిల్లులను లీజు తీసుకున్నారు. అధికారులతో కుమ్మక్కై కోట్లాది రూపాయలు సొమ్ముచేసుకుంటున్నారు. రవికృష్ణ మిల్లు కూడా అంతే.. లీజుకు తీసుకొని రూ.20 కోట్ల విలువైన ధాన్యం తీసుకొని అమ్ముకొని భార్య పేరిట మరో మిల్లు నిర్మాణం చేస్తున్నారని సివిల్ సప్లయీస్ వర్గాల ద్వారా తెలిసింది. రూ.కోట్లల్లో మామూళ్లు వస్తుండటంతో లీజు మిల్లు, డీఫాల్ట్ మిల్లు, చిన్న మిల్లు దాని కెపాసిటీ ఏంటి? అనేది చూడకుండా ఇష్టారాజ్యంగా ధాన్యం ఇచ్చేస్తున్నారు.
అధికారులను అడిగితే బ్యాంకు గ్యారెంటీలు ఉన్నాయని అంటున్నారు. కానీ అక్కడ రూ.50 లక్షలకు గ్యారెంటీ ఉంటే రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల విలువైన ధాన్యం ఎలా ఇచ్చారంటే సమాధానం లేదు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లావ్యాప్తంగా రూ.నాలుగు కోట్ల నుంచి రూ.8 కోట్ల విలువ చేసే మిల్లులకు మూడు సీజన్లలో రూ.15 కోట్ల నుంచి రూ.25 కోట్ల విలువ చేసే ధాన్యం ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఇటీవల తనిఖీల సందర్భంగా జిల్లాలోని పెద్ద, చిన్నవి కలిపి 18 మిల్లుల్లో పరిశీలించగా దాదాపు రూ.477 కోట్ల ధాన్యం మాయమైనట్టు తేలగా, ఆయా మిల్లులపై కేసులు నమోదు చేశారు. ఆయా మిల్లుల్లో తనిఖీలు చేస్తే మరిన్ని విస్తుపోయే అక్రమాలు వెలుగులోకి రానున్నట్టు సమాచారం.
ఇంకో విచిత్రమేమంటే తమ మిల్లులను తనిఖీ చేసి సీజ్ చేయాలని, దానికి ఎంతైనా ఇస్తామని పలువురు అక్రమార్కులే నేరుగా అధికారులకు ఆఫర్ ఇస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చి దర్జాగా తిరగొచ్చని సదరు వ్యక్తులు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. మరి అధికారులు ఏం చేస్తారో వేచి చూడాలి.
జిల్లాలో మొత్తం 74 మిల్లులు..
సూర్యాపేట జిల్లాలో మొత్తం 74 మిల్లులకుగాను రూ.కోటి నుంచి రూ.8 కోట్ల విలువ చేసే మిల్లులు 35 వరకు ఉన్నాయి. వీటిలో రూ.4 కోట్ల విలువైనవి 15 వరకు ఉన్నాయట. మొక్కుబడిగా ఒక షెడ్డు.. చిన్నపాటి యంత్రాలతో రూ.నాలుగైదు కోట్ల విలువ చేయని రైస్ మిల్లులను ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో 50 నుంచి 70 శాతం ధాన్యం మాయమైనట్టు తెలుస్తున్నది. తనిఖీలు చేపట్టాల్సిన టెక్నికల్ అసిస్టెంట్లు టాస్క్‌ఫోర్స్, విజిలెన్స్ బృందాలు వచ్చినప్పుడు మాత్రమే వారి వెంట వెళ్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

