హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం చెల్లాపూర్ సమీపంలో పాత రాతియుగం నాటి పనిముట్లు లభ్యమయ్యాయి. స్థానికంగా 6వ తరగతి చదువుతున్న దొబ్బలి శివకుమార్‌కు ఓ రాతిపనిముట్టు దొరికింది. దానిని తమ ఉపాధ్యాయుల సహకారంతో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులకు చూపించాడు.
ఈ రాతిపనిముట్టు పొడవు 12.5 సెం.మీ., వెడల్పు 8.5 సెం.మీ., మందం 3.5 సెం.మీ.లుగా ఉంది. ఈ రాతిపరికరం ఫొటోలను అంతర్జాతీయ ప్రాక్చరిత్రకారుడు రవికొరిసెట్టర్ (కర్ణాటక), కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తదితరులు పరిశీలించి అది తొలి పాతరాతియుగం రాతిపనిముట్టు (రాతి గొడ్డలి)గా నిర్ధారించారు. ఈ పనిముట్టు వయసు కనీసం లక్ష సంవత్సరాలకుపైగా ఉంటుందని హరగోపాల్ చెప్పారు.