హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ) : కొవిడ్ నిబంధనలను అనుసరించే ఈ ఏడాది ఎస్సెస్సీ(పదో తరగతి) పరీక్షలను నిర్వహించనున్నారు. గతంలో పాటించిన నిబంధనలను ఈ ఏడాది సైతం అమలు చేయనున్నారు. ముఖ్యంగా సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించనున్నారు. ఈ నేపథ్యంలోనే పరీక్ష కేంద్రాల సంఖ్య భారీగా పెరిగింది.
ఈ ఏడాది 2,861 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. 2020లో 2,393 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 2021లో కొవిడ్ ఉధృతి నేపథ్యంలో పరీక్షలను నిర్వహించలేదు. తాజా పరిస్థితుల దృష్ట్యా 468 పరీక్ష కేంద్రాలను పెంచారు. ఈ ఏడాది ఎస్సెస్సీ పరీక్షలకు 5.09 లక్షల విద్యార్థులు హాజరుకాబోతున్నారు. కాగా, మే 11 నుంచి 20 తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి.