వనపర్తి టౌన్, అక్టోబర్ 7 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ లిఫ్ట్-1 మోటర్లు ఆన్ చేయకుంటే ఈ నెల 12న వేలాది మంది రైతులతో కలిసి ముట్టడిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేఎల్ఐ పంపులను నిర్విరామంగా నడిపి ఆయకట్టుకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కల్వకుర్తి, జూరాల, ఎడమ, కుడి కాలువలు, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ పరిధిలో 7 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని తెలిపారు. ఈ సమయంలో సాగునీరు అందకుంటే పంటలు ఎండిపోయి అన్నదాత నష్టపోయే ప్రమాదం ఉన్నదని చెప్పారు.
శ్రీశైలం ప్రాజెక్టులో అడుగున నీరు ఉన్నా ..ఎత్తిపోసుకునేలా ఎల్లూరు, నార్లాపూర్ ప్రాజెక్టుల డిజైన్ చేసినట్లు గుర్తుచేశారు. ఒక్కో పంపు 30 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తాయని, కరెంట్ సరఫరా చేయకపోవడంతో మోటర్లన్నీ బంద్ అయ్యి వానకాలం పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్ కమిటీ నివేదికలను అమలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పచ్చబడిన పాలమూరును వలసల బాట పట్టిస్తున్నారని విమర్శించారు. జూరాలలో 9 టీఎంసీల నీళ్లు ఉన్నా రైతులను అరిగోస పెడ్తున్నారని మండిపడ్డారు. మంత్రులందరూ కర్ణాటక సీఎం వద్దకు వెళ్లి నార్లాపూర్, జూరాలకు నీటిని విడుదల చేయించి పంటలు కాపాడాలని సూచించారు. తమ భూములపై ఉన్న ఆరోపణలు నిరూపించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు.