హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించి వరుసగా దొరికిపోతున్న బీజేపీని నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు, పేపర్ లీకేజీ కేసు కలిపి ‘బీజేపీ బ్రోకర్ అండ్ లీకర్’ హ్యాష్ ట్యాగ్‌తో విరుచుకుపడుతున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ దేశంలోనే అగ్రస్థానంలో ట్రెండింగ్ అయ్యింది. బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్ తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన ‘బ్రోకర్’ అని, పది ప్రశ్నపత్రాలను లీక్ చేసిన బండి సంజయ్ ‘లీకర్’ అని పేర్కొన్నారు. ‘రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లీకింగ్ చేస్తూ దొరికిపోయాడు.. జాతీయ కార్యదర్శి బ్రోకరింగ్ చేస్తూ పట్టుబడ్డాడు.. వీళ్లందరి అధినేతేమో డిగ్రీ సర్టిఫికెట్‌ను ఫేకింగ్ చేస్తూ దొరికిపోయాడు’.. అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.
బీజేపీ నేతల తీరుపై హోంమంత్రి మహమూద్ అలీ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ‘బీజేపీ నేతలు ఇప్పుడు అదనపు రాజ్యాంగ అధికారులుగా మారారు.. వారికి ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం లేదు.. రాజకీయ ప్రత్యర్థులను బుల్డోజ్ చేయడం నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం.. ప్రశ్నపత్రాలు లీక్ చేయడం వరకు ఎంతకైనా తెగిస్తారు’.. అంటూ ట్వీట్ చేశారు. BJP#BJPBrokerAndLeakerకి నో చెప్పాలని కోరారు.