NAAC | హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): కాలేజీలను గుర్తించే విధానాన్ని సమూలంగా మార్చేందుకు న్యాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్) చర్యలు చేపట్టింది. అందుకోసం కొత్త నిబంధనలను రూపొందిస్తున్నది. తదనుగుణంగా ఇకపై ఏ, బీ, సీ, డీ గ్రేడ్లకు బదులుగా 5 స్థాయిల్లో మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడెడ్ అక్రెడిటేషన్లు (ఎంబీజీఏ) జారీచేయనున్నది. దీనిపై న్యాక్ ఇటీవల బెంగళూరులో విసృ్తతస్థాయి సమావేశాలను నిర్వహించింది. దక్షిణాది రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ల చైర్మన్లతోపాటు పలువురు విద్యారంగ నిపుణులను ఈ సమావేశాలకు ఆహ్వానించి, న్యాక్ నిబంధనలను మరింత సరళతరం చేసేందుకు చేపడుతున్న చర్యలను వివరించింది. కొత్త నిబంధనలపై రాష్ట్రాల స్థాయిలో అవగాహన కల్పించాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటిని అమలు చేసేందుకు సిద్ధమవ్వాలని సూచించింది. ఇప్పటివరకూ న్యాక్ గుర్తింపు కోసం కొన్ని కాలేజీలు మాత్రమే పోటీపడేవి. కానీ, ఇకపై అన్ని కాలేజీలు న్యాక్ గుర్తింపు పొందేలా ప్రోత్సహించేందుకు మార్గదర్శకాలను సవరించారు. న్యాక్ గుర్తింపును ఇచ్చేందుకు అనుసరిస్తున్న ప్రామాణికాలను 7 నుంచి 10కి పెంచారు. దీంతో ఇకపై కాలేజీలకు సంబంధించిన ఐదేండ్ల డాటాను న్యాక్ బృందం పరిశీలిస్తుంది. మౌలిక సదుపాయల పెంపు, ఫ్యాకల్టీ, ఫలితాలు, ఉపాధి అవకాశాలు, సొంత బిల్డింగ్ ఉన్నదా? లేదా? అనే అంశాలను పరిశీలించి కాలజీలకు మారులు ఇస్తుంది. గతంలో ఉన్న నిబంధనలతో కొన్ని కాలేజీలు మాత్రమే న్యాక్ గుర్తింపును పొందగలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనలను సరళీకరించాలని న్యాక్ నిర్ణయించింది.
కాలేజీల గుర్తింపు ప్రక్రియను మరింత సరళీకృతం చేసేందుకు నిబంధనల్లో సమూల మార్పులు చేయాలని న్యాక్ ప్రతిపాదించింది. అన్ని కాలేజీలను న్యాక్ గుర్తింపు పరిధిలోకి తేవడం, నాణ్యతను పెంపొందించడమే దీని ఉద్దేశం. ఈ ప్రతిపాదనపై ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో విసృ్తత చర్చ జరిగింది. న్యాక్ గుర్తింపు పొందేలా రాష్ట్రంలోని అన్ని కాలేజీలను ప్రోత్సహిస్తాం. ఎస్ఎస్ఆర్ రిపోర్టు తయారీ కోసం డిగ్రీ కాలేజీలకు రూ.లక్ష చొప్పున గ్రాంట్ మంజూరు చేస్తున్నాం. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత కాలేజీలు సద్వినియోగం చేసుకోవాలి.