హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): పేదల కష్టార్జితాన్ని దోచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనాతీరు ఉన్నదని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులను కూడా అడ్డదారిలో రిజిస్ట్రేషన్లు చేస్తూ అధికారులు జేబులు నింపుకొంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇటీవల పీర్జాదిగూడలోని సర్వే నంబర్ 39, 43, 44లో భూములను నిషేధించిందని, కానీ, ఇక్కడి అధికారులు మాత్రం అవేవీ పట్టనట్టుగా, నిషేధిత జాబితా తమకు వర్తించదన్నట్టుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని విమర్శించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
డాక్యుమెంట్ రైటర్లకు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కింది నుంచి పైస్థాయి వరకు ముడుపులు కట్టబెడితే నిబంధనలతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని, ఈ వ్యవహారంలో జిల్లా రిజిస్ట్రార్ కూడా వాటాదారుడిగా ఉన్నారని కిందిస్థాయి సిబ్బంది బాహాటంగా చెప్తున్నారని నారగోని ఆరోపించారు. ప్రతి నెలా ఈ జాబితా పేరిట జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కోట్ల రూపాయల లావాదేవీలు, డీఆర్వో నుంచి రిజిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయంలోని కీలక అధికారులకు వాటాలు ముడితేగానీ రిజిస్ట్రేషన్ చేయడం లేదని విమర్శించారు. ముడుపులు అందితే, నిషేధిత జాబితా నుంచి కూడా ఎత్తివేస్తామని అధికారులు బహిరంగంగా చెబుతూ అక్రమ దందాకు తెరలేపారని, దీనికి పీర్జాదిగూడలోని నిషేధిత సర్వే నంబర్లో ఇటీవల జరిగిన లావాదేవీలే నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రొహిబిటెడ్ ఉన్నా కనిపించదు
నిషేధిత సర్వే నంబర్లో నిర్మించిన ఓ అపార్టుమెంట్లో ఇటీవల జరిగిన రిజిస్ట్రేషన్‌తో ఈ వ్యవహారం బట్టబయలైందని నారగోని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. జాబితా వెలువడిన కొద్దిరోజులకే రిజిస్ట్రేషన్ చేయడానికి లక్షల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. అయితే, అదే అపార్టుమెంట్లో ఉన్న మరో ఫ్లాటుకు అడిగినంత ముట్టజెప్పలేదని రిజిస్ట్రేషన్ చేయకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల రక్తం తాగేందుకు సాధనంలా మారిన ఈ నిషేధిత జాబితాను ప్రభుత్వం తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. పేదల కష్టార్జితాన్ని తాగుతున్న అవినీతి సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ముందు తెలంగాణ రియల్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.