ఓదెల/ పెద్దపల్లిరూరల్/ చొప్పదండి, సెప్టెంబర్ 22 : పిడుగుపాటుకు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన రైతు జంగ సుధాకర్‌రెడ్డి(65) మంగళవారం పొలానికి నీళ్లు పెట్టడానికి భార్య పుష్పలతతో కలిసి వెళ్లాడు. సుధాకర్‌రెడ్డి పొలంలో నీళ్లు పెడుతుండగా భార్య కొంత దూరంలో ఉన్నది. ఒంటి గంట సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చి ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. దీంతో ఆందోళనకు గురైన పుష్పలత భర్తను పిలవగా ఎంతకూ సమాధానం రాకపోవడంతో దగ్గరి వెళ్లి చూసే సరికి పొలంలో మృతిచెంది ఉన్నాడు.
పొత్కపల్లి ఎస్ఐ సనత్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంటకు చెందిన మాజీ ఎంపీటీసీ గోపు మంగమ్మ భర్త, గోపు నరేందర్‌రెడ్డి(60) వెదురుగట్ట శివారులోని తన భూమి వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం నరేందర్‌రెడ్డి సమీపంలో ఉరుములు మెరుపులతో పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
సాయంత్రమైనా నరేందర్‌రెడ్డి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా, పొలంలో చనిపోయి ఉన్నాడు. పెద్దపల్లి మండలం మూలసాలలో బోయిని సదయ్య, కాసు నరేశ్‌కు చెందిన 21 గొర్రెలు, మూడు పొట్టేళ్లు పిడుగుపాటుతో మృత్యువాత పడ్డాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేటలో కోమల్ల కనకయ్యకు చెందిన ఆవు పిడుగుపాటుతో మృతి చెందింది.