KTR | రాష్ట్రంలోని ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు తగ్గుదలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాలు తగ్గాయని ప్రభుత్వం ఒక్క వారంలోనే రెండుసార్లు ఒప్పుకోవడం ఆందోళనకరమైన విషయామని అన్నారు.
2023లో హైదరాబాద్లోని ఐటీ రంగంలో 9.46లక్షల ఉద్యోగాలు ఉండేవని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ 2026 నాటికి అవి 9.39 లక్షలకు తగ్గాయని ప్రభుత్వం ఒప్పుకుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మొదట మార్చి 16న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా వెల్లడించారని చెప్పారు. అనంతరం బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారని తెలిపారు.
ఐటీ సెక్టార్లో గణనీయంగా ఉద్యోగాల తగ్గుదలపై వారం వ్యవధిలోనే ప్రభుత్వం రెండు సార్లు అంగీకరించడం ఆశ్చర్యకరమని కేటీఆర్ అన్నారు. ఐటీ రంగంలో ఈ ఉద్యోగాల తగ్గుదలకు కృత్రిమ మేధస్సు (AI) కారణమా? లేదా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యమా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.