విదేశీ బొగ్గులో.. 3 వేల కోట్ల సామ్!
అనుమానాస్పద కంపెనీతో సీఎం చీకటి ఒప్పందం.. కృత్రిమంగా బొగ్గు కొరత, కరెంట్ సంక్షోభం.. అదునుచూసి కంపెనీని రంగంలోకి దింపిన సీఎం
- ప్రతి టన్నుపై రూ.1,500 చొప్పున కమీషన్: కేటీఆర్
- ‘భోత్రా’ చేసుకొన్న అగ్రిమెంట్లు బయటపెట్టాలి.. ఏ ప్రాతిపదికన ఎంపికచేశారో వెల్లడించాలి
- విదేశీ బొగ్గు దిగుమతితో సింగరేణికి మరణశాసనం
- కుంభకోణంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరుపాలి
- బొగ్గు సామ్ ఆపాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో రూ.3 వేల కోట్ల దోపిడీకి కుట్ర జరుగుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. భోత్రా లాజిస్టిక్స్ అనే అనుమానాస్పద కంపెనీతో సీఎం రేవంత్‌రెడ్డి ముందే చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. సింగరేణిలో బొగ్గు కొరత ఉన్నదంటూ కృత్రిమ సంక్షోభం సృష్టించి, అదును చూసి భోత్రా లాజిస్టిక్స్‌ను రంగంలోకి దించారని చెప్పారు.
ప్రతి టన్నుపై రూ.1,500 చొప్పున కమీషన్ల రూపంలో భారీ దోపిడీకి రంగం సిద్ధమైందని ఆరోపించారు. ఆ కంపెనీ ఎంపిక వెనుక ఉన్న మతలబేందో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. భోత్రా లాజిస్టిక్స్‌తో రాష్ట్రప్రభుత్వం, సింగరేణి చేసుకున్న అన్ని రహస్య అగ్రిమెంట్లను బయటపెట్టాలని కోరారు. సింగరేణిని బలహీనపరిచే కుట్రలను సహించబోమని, బీఆర్ఎస్ తరఫున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు కేటీఆర్ గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు.
టన్నుకు రూ.1,500 కమీషన్
రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా బొగ్గు, విద్యుత్తు సంక్షోభాన్ని సృష్టించారని కేటీఆర్ ఆరోపించారు. దానిని కుంటిసాకుగా చూపి, విదేశీ బొగ్గు దిగుమతి పేరుతో సుమారు రూ.3 వేల కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. సింగరేణికి ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా, దేశంలో వనరులు అందుబాటులో ఉన్నా, దేశీయ సరఫరాను పెంచకుండా విదేశీ బొగ్గు వైపు మొగ్గు చూపడం వెనుక చీకటి ఒప్పందాలున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో భోత్రా లాజిస్టిక్స్ సంస్థ పాత్ర అనుమానాస్పదంగా ఉన్నదని పేర్కొన్నారు.
ఆ సంస్థకు కాంట్రాక్టులు అప్పగించేందుకు అనుసరించిన ప్రమాణాలేంది? టెండర్ల ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగింది? ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనలు, ఒప్పందాలు జరిగాయి? అనే వివరాలను ప్రభుత్వం బహిర్గతపర్చాలని డిమాండ్ చేశారు. బొగ్గు కొనుగోలు ధర, రవాణా వ్యయం, బీమా, ఇతర లాజిస్టిక్స్ ఖర్చులు, మధ్యవర్తుల పాత్రపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. భోత్రా సంస్థతో సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వం చేసుకొన్న ఒప్పందాలు, చెల్లింపుల వివరాలనూ బహిర్గతం చేయాలని కోరారు. విదేశీ బొగ్గు దిగుమతుల పేరుతో టన్నుకు రూ.1,500 చొప్పున కమీషన్లు దండుకునే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు.
ముందస్తు ప్రణాళికలో ప్రభుత్వం విఫలం
కరెంట్ కోతలపై ప్రజలు, రైతులు చేపడుతున్న ఆందోళనలను కూడా కాంగ్రెస్ సర్కార్ తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నదని కేటీఆర్ మండిపడ్డారు. వేసవిలో విద్యుత్తు డిమాండ్ పెరుగుతుందని ముందే తెలిసినా బొగ్గు నిల్వలు, ఉత్పత్తి, రవాణా, సరఫరాపై ప్రభుత్వం సమర్థవంతమైన ప్రణాళిక రూపొందించనే లేదని తెలిపారు. సంక్షోభం తీవ్రమయ్యాక అధికారులతో సమీక్షలు నిర్వహించి, వారిపై నెపం నెట్టడం ద్వా రా ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోలేదని స్పష్టంచేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం తో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి భారీగా పడిపోయిందని తెలిపారు. 2023-24లో 70.02 మిలియన్ టన్నుల ఉత్పత్తి నమోదు కాగా, 2025-26లో సుమారు 58 మిలియ న్ టన్నులకు పడిపోయిందని తెలిపారు. ఈ తగ్గుదలకు కారణాలేంది? గనుల అభివృద్ధి, యంత్రాలు, పెట్టుబడులు, అనుమతుల విషయంలో ప్రభు త్వం తీసుకున్న చర్యలేంది? అని ప్రశ్నించారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించకుండా బొగ్గు కొరత ఉన్నదని చెప్పడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. సింగరేణి కార్మికులకు బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నప్పుడు, ఎందుకు పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు? దేశీయంగా బొగ్గు కొరతను ఎందుకు నివారించలేకపోయారు? ఇది కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం కాదా? అని నిలదీశారు.
‘యాదాద్రి’కి బొగ్గు సరఫరాపై స్పష్టత ఇవ్వాలి
యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌కు బొగ్గు సరఫరాపై ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించాలని కేటీఆర్ కోరారు. 2018 ఫిబ్రవరి 15న కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం సింగరేణి గనుల నుంచి ఏటా 14 మిలియన్ టన్నుల జీ-9 గ్రేడ్ బొగ్గు సరఫరాకు లింకేజీ కేటాయించారని పేరొన్నారు. 2022 ఏప్రిల్ 27న సరఫరా ఒప్పందం కూడా కుదిరిందని తెలిపారు. అలాంటప్పుడు ప్రస్తుత కొరతకు కారణాలేంటో? బొగ్గు నిల్వలు, నాణ్యత, రవాణా పరిస్థితులేంటో? ప్రభుత్వం వివరించాలని కోరారు.
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో బొగ్గు, యాష్ హ్యాండ్లింగ్ వంటి పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. తెలంగాణ జెన్కోకు అనుభవజ్ఞులైన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు ఉన్నప్పుడు ప్రైవేట్ సంస్థలకు పనులు అప్పగించాల్సిన అవసరమేందని ప్రశ్నించారు. టెండర్ల విలువ, ఒప్పంద నిబంధనలు, నిర్వహణ ఖర్చులు, ప్రభుత్వరంగ సంస్థల సామర్థ్యంపై చేసిన అధ్యయనాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
సింగరేణి బకాయిల లెక్కలు చెప్పండి
సింగరేణికి సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలున్నాయన్న అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సంస్థలవారీగా ఎంత బకాయి ఉన్నది? ఎంత వసూలైంది? ఇంకా ఎంత పెండింగ్‌లో ఉన్నది? అనే వివరాలను వెల్లడించాలని కోరారు. బకాయిలు చెల్లించకుండా, గనుల అభివృద్ధికి నిధులను సమకూర్చకుండా సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయడం సరికాదని పేర్కొన్నారు. సింగరేణితోపాటు ఒడిశాలోని నైనీ బ్లాక్, మహానది ప్రాంతాల నుంచి బొగ్గు సరఫరాను పెంచే అవకాశాలు ఉన్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దేశీయ వనరుల నుంచి సరఫరా పెంచేలా ముందస్తు ఏర్పాట్లు చేయకుండా విదేశీ బొగ్గుపై ఆధారపడటం వల్ల రాష్ట్రంపై అదనపు ఆర్థికభారం పడుతుందని హెచ్చరించారు. ప్రజాధనాన్ని ఆదా చేయాలంటే ముందుగా దేశీయ వనరుల వినియోగానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. దేశీయ బొగ్గు వనరుల వినియోగం, విద్యుదుత్పత్తి, నిరంతర సరఫరాపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ చేసిన ప్రధాన డిమాండ్లు
- 1. విదేశీ బొగ్గు దిగుమతుల ప్రతిపాదనలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇప్పటివరకు జరిగిన చర్చలు, ప్రతిపాదనలు, టెండర్లు, కొనుగోలు పరిమాణం, ధరల అంచనాలను ప్రజల ముందుంచాలి.
- 2. రూ.3,000 కోట్ల బొగ్గు కుంభకోణంపై స్వతంత్ర విచారణ జరిపించాలి. దిగుమతుల ప్రతిపాదనల వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, మధ్యవర్తుల పాత్రను పరిశీలించి సమగ్ర నివేదిక విడుదల చేయాలి.
- 3. భోత్రా లాజిస్టిక్స్ సంస్థ పాత్రపై సమగ్ర విచారణ జరగాలి. ఆ సంస్థతో జరిగిన చర్చలు, ప్రతిపాదనలు, టెండర్లు లేదా ఒప్పందాలకు, చేసిన చెల్లింపులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముందు బహిర్గతం చేయాలి.
- 4. సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి. గనుల వారీగా ఉత్పత్తి, లక్ష్యాలు, తగ్గుదలకు కారణాలు, ఉత్పత్తి పెంపునకు తీసుకుంటున్న చర్యలను
వివరించాలి. - 5. సింగరేణికి రావాల్సిన బకాయిలపై సంస్థల వారీగా పూర్తి లెకలు ప్రకటించాలి. ఎంత మొత్తం రావాల్సి ఉంది, ఎంత వసూలైంది, ఎంత పెండిగ్లో ఉన్నదో ఆడిట్ ఆధారాలతో తెలియజేయాలి.
- 6. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు బొగ్గు సరఫరాపై స్పష్టత ఇవ్వాలి. 14 ఎంటీపీఏ జీ-9 బొగ్గు లింకేజీ, సరఫరా ఒప్పందం ఉన్నా ప్రస్తుత సరఫరా స్థితి, కొరతకు కారణాలను వెల్లడించాలి.
- 7. దేశీయ బొగ్గు వనరుల వినియోగానికి కార్యాచరణ ప్రకటించాలి. సింగరేణి, నైనీ బ్లాక్, మహానదితోపాటు ఇతర దేశీయ వనరుల నుంచి సరఫరా పెంచే ప్రణాళికను వెల్లడించాలి.
- 8. సింగరేణి, విద్యుత్తు సంస్థల ప్రయోజనాలను కాపాడాలి. ప్రభుత్వరంగ సంస్థల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకుని, ప్రైవేట్ కాంట్రాక్టుల విషయంలో పారదర్శకత పాటించాలి. సింగరేణిని బలహీనపరిచే చర్యలకు స్వస్తి చెప్పాలి.
- 9. విద్యుత్తు సంక్షోభంపై ప్రభుత్వ ప్రణాళికలను స్పష్టం చేయాలి. బొగ్గు సరఫరా, విద్యుత్ ఉత్పత్తి, ముందస్తు ప్రణాళికలో జరిగిన లోపాలపై సమగ్ర నివేదిక విడుదల చేసి, ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలి.
శ్వేతపత్రం విడుదల చేయాలి
విదేశీ బొగ్గు దిగుమతుల ప్రతిపాదనలు, కొనుగోలు పరిమాణం, ధరల అంచనాలు, టెండర్లు, సరఫరాదారుల ఎంపిక వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. భోత్రా లాజిస్టిక్స్ సంస్థతో జరిగిన చర్చలు, ప్రతిపాదనలు, ఒప్పందాలు, చెల్లింపులపై పూర్తి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. విదేశీ బొగ్గు దిగుమతుల వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించి, ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తుల పాత్ర, నిర్ణయాల వెనుక ఉన్న కారణాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. సంక్షోభాన్ని సాకుగా చూపి విదేశీ బొగ్గు దిగుమతుల వైపు మొగ్గుచూపడం, ప్రభుత్వరంగ సంస్థల సామర్థ్యాన్ని నిర్లక్ష్యం చేయడం తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమని కేటీఆర్ విమర్శించారు.
సింగరేణిని బలహీనపరిచే చర్యలను బీఆర్ఎస్ సహించబోదని స్పష్టంచేశారు. రూ.3 వేల కోట్ల బొగ్గు సామ్, భోత్రా లాజిస్టిక్స్ పాత్ర, సింగరేణి ఉత్పత్తి తగ్గుదల, బకాయిలు, యాదాద్రికి బొగ్గు సరఫరా, దేశీయ వనరుల వినియోగంపై స్వతంత్ర విచారణ జరిపించి, సమగ్ర నివేదికలు బయటపెట్టాలని ఆయన స్పష్టంచేశారు. విద్యుత్తు, బొగ్గు సంక్షోభాల పేరుతో రూ.వేల కోట్లు దోచుకోవాలని చూస్తే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకోవాల్సిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహకరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై సింగరేణి ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

