హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జెన్కో రాత పరీక్ష వాయిదా పడింది. ఈ నెల 17న జరగాల్సిన ఈ పరీక్షను అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేస్తున్నట్టు జెన్కో ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు ఉత్పత్తి సంస్థ (జెన్కో)లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్), కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది అక్టోబర్లో జెన్కో నోటిఫికేషన్ జారీ చేసింది.
17న ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండటంతో జెన్కో పరీక్షను వాయిదావేయాలని అభ్యర్థులు కోరారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కలను కలిసి విజ్ఞప్తిచేశారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరీక్షను వాయిదావేస్తున్నట్టు జెన్కో ప్రకటించింది. తదుపరి షెడ్యూల్ను సంస్థ వెబ్సైట్లో పొందుపరుస్తామని జెన్కో వర్గాలు వెల్లడించాయి.