జగిత్యాల గడ్డమీద నుంచి చెప్తున్నా. నేను ఏనాడూ మాట ఇచ్చి తప్పలే. కాబట్టి మీరు (సభకు వచ్చిన వారిని ఉద్దేశించి) జగిత్యాలలో యుద్ధం చెయ్యాలె.. ఆయనను (జీవన్‌రెడ్డిని) నాకు అప్పగించాలె.. జగిత్యాల యుద్ధం మీవంతు.. తెలంగాణ యుద్ధం మావంతు.
-కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దరిద్రపు పాలన పోయి నూటికి నూరు శాతం మళ్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తదని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పారు. జీవన్‌రెడ్డి రాకతో పార్టీలో ఊపు వస్తున్నదని, ఆయన ప్రభావం జగిత్యాలలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ఉంటుందని తెలిపారు. జీవన్‌రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తున్నానని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలందరికీ సేవలందించే అవకాశం కల్పిస్తానని ప్రకటించారు. బీఆర్ఎస్లో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి చేరిక సందర్భంగా జగిత్యాలలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ తనదైన శైలిలో పంచులు, చలోక్తులు విసురుతూ ఆకట్టుకున్నారు.
బీఆర్ఎస్ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివరిస్తూనే ప్రస్తుత కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. ‘జగిత్యాలకు చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ ఒక మాట చెప్పిండ్రు.. ‘చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతది. గుండె ధైర్యముంటే నీవెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తది’ అన్నరు. ఇయ్యాల నా కండ్ల ముందున్న మీరు, ఇంతకంటే రెండింతలు రోడ్ల మీద ఉన్న అశేషమైన జీవన్‌రెడ్డి అభిమానులు, మీ అందరి ఆశీర్వాదంతోని గుండె ధైర్యమున్న జీవన్‌రెడ్డి ఇంతమంది సైన్యాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్లో చేరిండ్రు. ఆయనతో ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వారికి, పల్లెలు, పట్నాల్లో ఉండి రానివారికి, వెంటవచ్చిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లకు పేరుపేరునా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నా’ అంటూ సాదరంగా ఆహ్వానించారు.
జీవన్ కోరిక మేరకే బోర్నపల్లి బ్రిడ్డికి నిధులు
నాడు జగిత్యాలలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా జీవన్‌రెడ్డి గెలిచినా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు అడిగిన వెంటనే ఇచ్చానని కేసీఆర్ గుర్తుచేశారు. ‘నేను ముఖ్యమంత్రి అయినంక కరీంనగర్లో నిర్వహించిన సభకు ప్రజాప్రతినిధిగా జీవన్‌రెడ్డి వచ్చిండ్రు. బోర్నపల్లి వద్ద గోదావరి మీద బ్రిడ్డి అవసరం..కంపల్సరీ కావాలి అని అడిగిన్రు. ఇగ నేను హోదాలు గీదాలు మరచిపోయి ఏంది జీవనన్నా మళ్లా చెప్పు అంటే చెప్పిన్రు..వెంటనే అక్కడి నుంచే రూ.80 కోట్లు మంజూరు చేసిన. వెంటనే ఆ బ్రిడ్డి కట్టించినం. తన నియోజకవర్గం, పరిసర ప్రాంత ప్రజలపై జీవన్‌రెడ్డి కనబరిచిన ప్రేమ అద్భుతం. అందుకే ఆయనకు అంత మంచి పేరున్నది. అది నాకంటే మీకందరికీ బాగా తెలుసు. ఈ మధ్య వీళ్లంతా తయారైన్రు గదా.. ఊ అంటే ఆ అంటే సర్వేలు జేసిత్తరు. జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరితే ప్రభావం ఎట్లా ఉంటది? ఏం కథ? అని ఓ ఇద్దరు ముగ్గురు సర్వేచేసి్రండు. మీ నియోజకవర్గం కాదు.. మీ నియోజవకర్గంలో ఆటంబాంబే పేలిపోయిం ది. ఇక ఆ చర్చేలేదు. కానీ వాళ్లు చెప్పిందేంటం టే.. చొప్పదండి, ధర్మపురి, మెట్పల్లి, కోరుట్లనే కాదు.. చాలా ప్రాంతాల్లో ప్రభావం ఉంటదని చెప్పిండ్రు’ అని వివరించారు.
ఆయనకు పదవులు కొత్తకాదు
మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి పదవులు కొత్తకాదని, ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు అలంకరించి ఎన్నో మంచి పనులు చేశారని కేసీఆర్ గుర్తుచేశారు. ‘జీవన్‌రెడ్డి ఒక్క నియోజకవర్గానికో.. పదిమందికో పరిమితమైన వ్యక్తికాదు. ఆయనకు ఏ హోదా లభించినా ఈ ప్రాంతం కోసం తపించిండ్రు. ఒక ఉదాహరణ కనిపిస్తది. పేరు ప్రతిష్టలేని వ్యక్తులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజవర్గంల నిలబడితే గెలువరు. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా పోటీచేస్తే విజ్ఞులైన యువకులు ఓటేసి గెలిపించిండ్రు. జీవన్‌రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని సమితి ప్రెసిడెంట్‌గా ప్రారంభించిండ్రు. ప్రజాసమస్యలపై పోరాటం చేసి..సివిల్ లిబర్టీస్గా, అడ్వొకేట్‌గా పౌరహక్కుల సంఘాలకు మద్దతిచ్చి అచ్చమైన నికార్సయిన కార్యకర్తగా నిరూపించుకున్నరు. అంచెలంచెలుగా ఎదిగిండ్రు. అనేక హోదాలు అనుభవించిండ్రు..పదవులు ఆయనకు కొత్తకాదు.. శాసనసభ్యుడిగా..మంత్రిగా ఎన్నో మంచి పనులు చేసిండ్రు. అదంతా మీకు తెలుసు. అంటూ పేర్కొన్నారు.

భవిష్యత్తులో కీలక పదవి ఇస్త
బీఆర్ఎస్లో చేరిన జీవన్‌రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేసీఆర్ నియమించారు. ఆయనకు భవిష్యత్తుల్లో కీలక పదవి ఇస్తామని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ‘జీవన్‌రెడ్డి నేను మొన్న కలిసినప్పుడు ఒక మాట అనుకున్నం..ఒకరికొకరు ఏవిధంగా పనిచేయాలని నిర్ణయించుకున్నం.. ఒక కుటుంబంలో అన్నదమ్ముల్లా పనిజేద్దామని చెప్పిన. పిల్లర్స్లాగా పనిచేసి ఈ పార్టీని ముందుకు తీసుకుపోదామని చెప్పిన. ఈ రోజు ఆయన పార్టీలో చేరగానే బ్రహ్మాండమైన ఊపు వస్తున్నది. నేను జీవన్‌రెడ్డిని కోరుతున్న. జగిత్యాల కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు పరిసర జిల్లాలూ చూడాలె. అందుకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి అపాయింట్ చేసుకుంటున్న. తెలంగాణ ప్రాంతమంతా మీ సేవలు అవసరమున్నయి. అంతేకాదు, ఆరు నూరైనా ఏదేమైనా నూటికి నూరు శాతం బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తది’ అని తేల్చిచెప్పారు. ‘వస్తదనేటోళ్లు చేతులు లావట్టుండ్రి’ అని కేసీఆర్ కోరగానే సభకు హాజరైన వారంతా చేతులు లేపి ఈలలు కొట్టి మద్దతిచ్చారు..ఈ సందర్భంగా కేసీఆర్ ‘కెమెరాలు గటు తింపుండ్రి’ అని సూచించారు. ‘ఇయ్యాల జీవన్‌రెడ్డి పార్టీకి సేవచేయడమే కాదు, భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత బ్రహ్మాండమైన పదవిలో జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలకు సేవలందించబోతడు. ఇదీ కేసీఆర్ మాట.. జగిత్యాల గడ్డమీద నుంచి చెప్తన్నా. నేను ఏనాడూ మాట ఇచ్చి తప్పలే. కాబట్టి మీరు (సభకు వచ్చిన వారిని ఉద్దేశించి) జగిత్యాలలో యుద్ధం చెయ్యాలె.. ఆయనను నాకు అప్పగించాలె..జగిత్యాలల మీరు సరిపోతరు.. నేను చెప్పింది కరెక్టే గదా! జగిత్యాల యుద్ధం మీవంతు..తెలంగాణ యుద్ధం మావంతు.. ఒకే గదా!’ అని పిలుపునిచ్చారు.
జీవన్‌రెడ్డి, నేను మంచి స్నేహితులం..
జీవన్‌రెడ్డి, తానూ నలభై, నలభైఐదేండ్లుగా మంచి స్నేహితులమని కేసీఆర్ తెలిపారు. భిన్న రాజకీయాల కారణంగా విడివిడిగా పనిచేసినా, బాధలు, సుఖాలు, అభిప్రాయాలను కలిసే పంచుకొనేవాళ్లమని తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘జీవన్‌రెడ్డికి ఉండే నిబద్ధత, ప్రజాజీవనంలో పనిచేసిన పద్ధతి ఎందరికో ఆదర్శం. జగిత్యాలలో పుట్టి పెరిగి రాజకీయంగా పెద్దవాడైండ్రు. మీ అందరి దీవెనతో ఆయనకు జగిత్యాలలోనే కాదు పాత కరీంనగర్ జిల్లావ్యాప్తంగా, పొరుగున ఉన్న జిల్లాల్లో కూడా చాలామంది అభిమానులున్నరు. చాలా విషయాల్లో ఎందరికో ఆయన ఆదర్శంగా నిలిచిండ్రు. గొప్పగా పనిచేసిండ్రు. ఈ ప్రాంతం కోసం ప్రాణం పెట్టి పనిచేసిండ్రు. మంత్రిగా ఉన్నా.. ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకో హోదాలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా.. తన ప్రాంతం అభివృద్ధిని ఏనాడూ విస్మరించలేదు. అందుకే మీరు ఆయనకు ప్రాణమిచ్చి గుండెల్లో పెట్టి ఎన్నో పర్యాయాలు గెలిపించుకున్నరు’ అని కొనియాడారు.
చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూ అరణ్యమై భయపెడుతది.. గుండె ధైర్యముంటే నీవెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తది అని జగిత్యాల బిడ్డ అలిశెట్టి ప్రభాకర్ అన్నడు. ఇయ్యాల నా కండ్ల ముందున్న మీరు.. ఇంతకంటే రెండింతలు రోడ్ల మీద ఉన్న అశేషమైన జీవన్‌రెడ్డి అభిమానులు.. మీ అందరి ఆశీర్వాదంతోని గుండె ధైర్యమున్న జీవన్‌రెడ్డి ఇంతమంది సైన్యాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్లో చేరిండ్రు. -కేసీఆర్