హైదరాబాద్ : గుర్తింపు ప్రక్రియలో పలు మినహాయింపులు కల్పిస్తూ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు ఊరట కల్పించింది. 15 మీటర్లలోపు భవనాల్లోని కళాశాలల ఆటో రెన్యువల్‌కు నిర్ణయం వెలువరించింది. పెంచిన అనుబంధ గుర్తింపు ఫీజులను ఇంటర్ బోర్డు వెనక్కి తీసుకుంది. పాత రుసుములతోనే అనుబంధ గుర్తింపు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. శానిటరీ, నిర్మాణ పత్రం, సిబ్బంది వివరాలు 90 రోజుల్లో ఇచ్చేందుకు అవకాశం కల్పించింది. 15 మీటర్లపైన భవనాల్లోని కాలేజీలు అగ్నిమాపకశాఖ నుంచి ఎన్వోసీ పొందాలని తెలిపింది. జూనియర్ కళాశాలల అనుబంధ గుర్తింపు గడువును పొడిగించింది. ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 30 వరకు, అదే రూ. 20 వేల వరకు ఆలస్య రుసుంతో జులై 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొంది.