హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో న్యాయవాదులు తమ వృత్తిపరమైన విధులను నిర్భయంగా, స్వతంత్రంగా నిర్వహించేందుకు ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టం-2026ను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ మంగళవారం తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జీవోఎంఎస్ నంబర్ 41 ద్వారా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. న్యాయవాదులతోపాటు వారి కుటుంబసభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది.
కోర్టు అనుమతి లేకుండా లాయర్లను అరెస్టు చేసేందుకు వీల్లేకుండా ఈ చట్టంలో కీలకమైన రక్షణలు కల్పించారు. కొత్త చట్టం ప్రకారం ఏ న్యాయవాదినైనా అరెస్టు చేయాలంటే న్యాయస్థానం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. న్యాయవాదులపై కేసులు బనాయించే వ్యక్తులకు మూడేండ్లపాటు జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా, న్యాయవాదుల కుటుంబసభ్యులపై దాడి చేసినా కఠినంగా శిక్షిస్తారు. నేరం రుజువైతే 7 ఏండ్ల వరకు జైలు శిక్ష, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు.