జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటనలో ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌కు పోలీసుల లేఖ
వైరల్ చేసిన ఐదుగురిపై కేసు నమోదు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్‌మీడియాలో పోస్టు చేసినందుకు ఐదుగురిపై సైబర్‌క్రైమ్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోలను తొలగించాలని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులకు లేఖలు రాశారు.
లైంగికదాడి నిందితులు బాధితురాలికి సంబంధించిన కొన్ని వీడియోలను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పోస్టు చేయడమే కాకుండా, పలువురికి ఫార్వర్డ్ చేశారు. ఆ వీడియోలను ఇతరులు కూడా తమ ఖాతాల్లో పోస్టు చేశారు. లైంగికదాడి బాధితురాలి గోప్యతకు భంగం కలిగిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా సోషల్‌మీడియాలో వైరల్ చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే పాతబస్తీలోని యూట్యూబర్ సుభాన్కు నోటీసులు జారీ చేశారు. సిల్వేరి అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.