నాగర్ కర్నూల్ : జిల్లాలోని లింగాల మండలం సలేశ్వరం జాతరలో హోంగార్డ్ ఆత్మహత్య ( Home Guard Suicide) కలకలం సృష్టిస్తోంది. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని చెంచుగూడెంకు చెందిన బయన్న(46) కోడేరు పోలీస్ స్టేషన్ ( Koderu Police Station ) లో హోంగార్డు గా విధులు నిర్వహిస్తున్నారు.
సలేశ్వరం జాతరలో బందోబస్తులో ఉన్న ఆయన విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన పోలీస్ సిబ్బంది హోంగార్డును అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేస్తుండగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అతడి భార్య మూడు సంవత్సరాల క్రితం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. సలేశ్వరం జాతర సందర్భంగా బందోబస్తు డ్యూటీ పడిన పోలీస్ సిబ్బందికి అచ్చంపేటలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బయన్న గైరాజయ్యాడని పోలీసులు తెలిపారు.