ఆకాశహర్మ్యాలతోనే వసతుల మెరుగు
హైదరాబాద్ నలుమూలలా హైరైజ్ కల్చర్ విస్తరిస్తున్నది. తూర్పు, పశ్చిమం అన్న తేడా లేకుండా నగరమంతటా ఆకాశహర్మ్యాలు విపరీతంగా పెరుగుతున్నాయి.
- టీఎస్-బీపాస్‌తో పారదర్శకంగా అనుమతులు
- క్రెడాయ్ సహా ఐదు సంస్థల స్పష్టీకరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నలుమూలలా హైరైజ్ కల్చర్ విస్తరిస్తున్నది. తూర్పు, పశ్చిమం అన్న తేడా లేకుండా నగరమంతటా ఆకాశహర్మ్యాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వాటి వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయన్న ఆరోపణలను హైదరాబాద్ రియల్ ఎస్టేట్స్ డెవలపర్లు (క్రెడాయ్ సహా ఐదు సంస్థల ప్రతినిధులు) ముక్తకంఠంతో ఖండించారు. అవన్నీ నిరాధార ఆరోపణలేనని శనివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
ఆకాశహర్మ్యాలతోనే అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఒనగూరుతున్నాయని తెలిపారు. భవన నిర్మాణ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీపాస్ ఎంతో పారదర్శకంగా, పకడ్బందీగా అమలవుతున్నదని, నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని భద్రతా చర్యలను తీసుకుంటున్నదని వివరించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. భారీ భవనాలకు 2006లోనే అనుమతులు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యం త వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ప్రపంచం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు వచ్చేవారి సంఖ్య పెరగడంతో గ్లోబల్ స్టాండర్డ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లకు గిరాకీ అధికమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో ఎత్తయిన భవన నిర్మాణాలకు 2006లోనే అనుమతి ఇచ్చారు.
– రామకృష్ణారావు, క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్
టీఎస్-బీపాస్ విప్లవాత్మకం
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్-బీపాస్ ఓ విప్లవాత్మక సంస్కరణ. గతంలో అనుమతులు పొందేందుకు భారీగా లంచాలు ముట్టజెప్పడంతోపాటు తీవ్రంగా నిరీక్షించాల్సి వచ్చేది. వీటికి టీఎస్-బీపాస్ చెక్ పెట్టింది. ఇప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నిర్దేశిత వ్యవధిలోనే అనుమతులను మంజూరు చేస్తున్నారు. ఎంతో పారదర్శకంగా అమలవుతున్న ఈ ప్రక్రియ రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద బలాన్నిచ్చింది.
– మురళీకృష్ణ, క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్
క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతులు
హైదరాబాద్‌లో ఎత్తయిన భవన నిర్మాణాలను అనుమతిస్తూ 2006లో విడుదలైన జీవో 86కు కాలక్రమంలో చిన్నపాటి సవరణలు మాత్రమే జరిగాయి. భవనం ఎత్తు, సెట్‌బ్యాక్, రోడ్డు, పార్కింగ్, అగ్నిమాపక భద్రతా వ్యవస్థలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? లేవా? అన్న దానితోపాటు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతులు ఇస్తున్నారు.
– సుశీల్చంద్రారెడ్డి, ఎన్ఏఆర్ఈడీసీవో తెలంగాణ ప్రెసిడెంట్
వసతులు కావాలంటే ఎత్తయిన భవనాలు ఉండాల్సిందే
తెలంగాణ ప్రభుత్వ చొరవతో ఐటీ, ఫార్మా పరిశ్రమలకు హైదరాబాద్ ప్రధాన గమ్యస్థానంగా మారింది. నగరంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి విస్తరించింది. ఏటా ఐదు లక్షల మందికిపైగా ప్రజలు హైదరాబాద్‌కు వలస వస్తున్నారు. వారందరికీ వసతులు కల్పించాలంటే ఎత్తయిన భవనాలు కావాల్సిందే.
– జీవీ రావు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్
ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు
పెరుగుతున్న జనాభా, గృహ అవసరాలకు అనుగుణంగా ఎత్తయిన భవనాలను నిర్మించడానికి అపరిమిత ఎఫ్ఎస్ఐని అనుమతించాలని గతంలో బిల్డర్లు ఉమ్మడి ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. దాని ఫలితంగానే 2006లో జీవో 86 విడుదలైంది. కొద్దిపాటి సవరణలతోనే అదే జీవో ఇప్పుడూ అమలవుతున్నది. హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఇండ్ల నిర్మాణాలను చేపట్టేందుకు ఈ జీవో ఎంతో దోహదపడుతున్నది.
– సీ ప్రభాకర్‌రావు, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు
ట్రాఫిక్ సమస్యలకు చెక్
హైదరాబాద్‌లో లగ్జరీ అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరిగిందనడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రిజిస్ట్రేషన్లే తాజా నిదర్శనం. రూ.కోటి విలువైన అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లలో 8% వృద్ధి కనిపిస్తున్నది. నగర అభివృద్ధికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించాలన్న స్పృహతో అనేక కార్యక్రమాలను చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అధిక జనసాంధ్రత ఉన్న ప్రాంతాల్లో రోడ్లు 36-40 మీటర్ల వెడల్పు ఉండాలని నిర్దేశించింది. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎస్డీఆర్పీ ప్రాజెక్టు కింద రేడియల్, లింక్ రోడ్లను శరవేగంగా అభివృద్ధి చేస్తున్నది.
– రాజశేఖర్‌రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ సెక్రటరీ
హైదరాబాద్‌కు డెవలపర్ల క్యూ
సరస్సుల సుందరీకరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం, బీపాస్ అనుమతులతో పెరిగిన ఆకాశహర్మ్యాలు డెవలపర్లను హైదరాబాద్‌వైపు ఆకర్షిస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల నుంచి డెవలపర్లు క్యూ కట్టడానికి ఇదే ప్రధాన కారణం. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను నియంత్రించేందుకు డ్రోన్లు, రోబోలను వినియోగించాలన్న ప్రతిపాదనలను అగ్రిమాపక శాఖ సిద్ధం చేసింది.
– విజయ్‌సాయి మేకా, తెలంగాణ రాష్ట్ర ఎన్ఏఆర్ఈడీసీవో జనరల్ సెక్రటరీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

