Heat wave : రాష్ట్రంలో ఎండల తీవ్రత మళ్లీ పెరుగుతున్నది. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. పగటిపూట ఎండల మంటలు, రాత్రివేళల్లో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదిలాబాద్‌లో గరిష్ఠంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు కాగా.. భద్రాచలం, మహబూబ్‌నగర్‌లలో 36.2 డిగ్రీలు, హైదరాబాద్‌లో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించిది. రుతుపవనాల నిష్క్రమణ ప్రభావంవల్లే వాతావరణంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని అధికారులు స్పష్టంచేశారు. రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
గురువారం ఉత్తర, మధ్య తెలంగాణ ప్రాంతాల నుంచి రుతుపవనాలు వెనుదిరిగాయని, శుక్రవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఇవి పూర్తిగా నిష్క్రమిస్తాయని వాతావరణ అధికారులు చెప్పారు. రుతుపవనాల తిరోగమనం ప్రభావంతో రానున్న కొద్దిరోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.