హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తేతెలంగాణ) : రేవంత్‌రెడ్డి పాలనలో వైద్య రంగం నిర్వీర్యమైందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌కుమార్ విమర్శించారు. కేసీఆర్ నిర్విరామంగా శ్రమించి తీర్చిదిద్దిన ఆరోగ్యరంగం రేవంత్ హ యాంలో అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యమందించే లక్ష్యంతో రాష్ట్ర రాజధాని నలుదిక్కులా తలపెట్టిన టిమ్స్, వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ దవాఖానలపై కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలోనే 80% పనులు పూర్తయ్యాయని, మిగిలిన 20% పనులను పూర్తిచేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. కేసీఆర్‌కు పేరొస్తుందనే నెపంతో సూపర్స్పెషాలిటీల ప్రారంభంపై తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యమందించే లక్ష్యంతో గ్రామాల్లో పల్లె దవాఖానలు, మండల కేంద్రాల్లో పీహెచ్‌సీలు, నియోజకవర్గ కేంద్రాల్లో సీహెచ్‌సీలు, జిల్లాకో మెడికల్ కాలేజీ, వైద్యశాలలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ పాలనలో మెడికల్ కాలేజీలు, సర్కార్ దవాఖానలే అనారోగ్యంపాలైన దుస్థితి నెలకొన్నదని విమర్శించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యరంగాన్ని చిన్నచూపు చూస్తున్నదని సంజయ్‌కుమార్ ఆరోపించారు. మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ దవాఖానల్లో వసతుల కల్పనలో విఫలమైందని మండిపడ్డారు. జగిత్యాల మెడికల్ కాలేజీ 80% పూర్త యిందని..మిగిలిన పనులు పూర్తిచేసేందుకు సర్కార్‌కు వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించారు. అందాల పోటీలకు రూ.200 కోట్లు వెచ్చిస్తారు కానీ, పేదలకు వైద్యమందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వైద్యశాలలపై చిన్నచూపేందుకని నిలదీశారు. కేసీఆర్ హయాంలో దవాఖానలు బాగు చేసి, మందులు అందుబాటులో ఉంచి వైద్యవిప్లవం సృష్టిస్తే, రేవంత్ ప్రభుత్వం విధ్వంసం చేస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌లో నాడు ఏటా కోటిన్నర వైద్య పరీక్షలు జరిగితే, ఇప్పుడు అందులో సగం కూడా చేయడం లేదన్నారు. నిమ్స్‌లాంటి వైద్యసంస్థల్లో సర్జరీకి అవసరమైన ముఖ్యమైన మందులు, సామగ్రి కొరత ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.