రిలీవ్ చేశారు.. పోస్టింగులు మరిచారు!
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగుల పునర్విభజన వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారితీస్తున్నది. వైద్యవిధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న 558 మంది ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు..
-
వైద్య విధాన పరిషత్‌లో ఉద్యోగుల జీవితాలతో చెలగాటం
-
అయోమయంలో ఆ శాఖలోని 558 మంది ఉద్యోగుల భవితవ్యం
కరీంనగర్ విద్యానగర్, నవంబర్ 10: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగుల పునర్విభజన వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారితీస్తున్నది. వైద్యవిధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న 558 మంది ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు.. వారికి తదుపరి పోస్టింగులు ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఉద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన ఇంత కీలకమైన అంశంలో ముందస్తు ప్రణాళిక లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వంతోపాటు వైద్య ఆరోగ్యశాఖ పరిపాలనా వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నది. రాష్ట్రంలో కొత్త దవాఖానల ఏర్పాటు, వైద్య సేవల విస్తరణ, సిబ్బంది పునర్విభజన వంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ వాటి అమలు విషయంలో సమన్వయం కొరవడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవైపు ఉద్యోగులను రిలీవ్ చేసిన అధికారులు వారికి ఎకడ పోస్టింగులు కల్పించాలి? ఏ దవాఖానలో విధులు నిర్వర్తించాలి? అనే అంశాలను తేల్చకపోవడం వారి గందరగోళానికి నిదర్శనంగా నిలుస్తున్నది. ముందుగా ఖాళీలు, అవసరాలు, దవాఖానల వారీగా సిబ్బంది కేటాయింపులు ఖరారు చేసి ఆ తర్వాత రిలీవ్ చేయాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా వ్యవహరించడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
30 దవాఖానలు.. 558 మంది ఉద్యోగులు
ఉద్యోగుల పునర్విభజనకు సంబంధించి రూపొందించిన అనుబంధ వివరాల్లో మొత్తం 30 దవాఖానలకు సంబంధించి 558 మంది ఉద్యోగుల వివరాలు పొందుపరిచారు. వీరిలో 39 మంది వైద్యులు, 244 మంది నర్సింగ్ సిబ్బంది, 111 మంది మినిస్టీరియల్ సిబ్బంది, 48 మంది పారామెడికల్ సిబ్బంది, 116 మంది నాలుగో తరగతి ఉద్యోగులు ఉన్నారు. ఒక్క నర్సింగ్ విభాగంలో క్యాటగిరీల వారీగా చూస్తే.. 18 మంది నర్సింగ్ సూపరింటెండెంట్లు (గ్రేడ్ -1), 35 మంది నర్సింగ్ సూపరింటెండెంట్లు (గ్రేడ్ -2), 162 మంది హెడ్ నర్సులు, 29 మంది ఏఎన్ఎంలు ఉన్నారు. దవాఖానల్లో వైద్య సేవలు నిరంతరం కొనసాగడంలో నర్సింగ్ సిబ్బంది పాత్ర కీలకమైనది.
ఇంత పెద్ద సంఖ్యలో నర్సింగ్ సిబ్బంది పునర్విభజనకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సమయంలో వారి పోస్టింగులు, విధుల నిర్వహణ, దవాఖానల అవసరాలను ముందుగానే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఉద్యోగులను రిలీవ్ చేసిన తర్వాత కూడా పోస్టింగులపై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇక మినిస్టీరియల్ విభాగంలో 11 మంది అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, 16 మంది సీనియర్ అసిస్టెంట్లు, 73 మంది జూనియర్ అసిస్టెంట్లు ఇలా 111 మంది ఉద్యోగులు ఉన్నారు. దవాఖానల పరిపాలన, కార్యాలయ నిర్వహణ, ఉద్యోగుల సేవా వ్యవహారాలు, రికార్డుల నిర్వహణ వంటి కీలక బాధ్యతలు వీరిపై ఉంటాయి. వీరికి పోస్టింగుల విషయంలో స్పష్టత లేకపోతే దవాఖాన కార్యకలాపాలపైనా ప్రభావం పడే ప్రమాదమున్నది. ఈ నెల 10వ తేదీ నుంచి వారి విధుల నిర్వహణ, పే అండ్ అలవెన్సుల చెల్లింపులపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
విధులు ఎలా..? జీతాలు ఎలా?
రిలీవ్ అయిన ఉద్యోగులు ఈ నెల 10 నుంచి ఏ దవాఖానకు వెళ్లాలి? ఎవరికి రిపోర్టు చేయాలి? అనేది స్పష్టత లేకుండా పోయింది. వారి పే అండ్ అలవెన్సులు ఏ కార్యాలయం నుంచి చెల్లిస్తారు? ప్రస్తుత దవాఖానల యాజమాన్యాలే వేతనాలు చెల్లిస్తాయా..? లేక కొత్తగా కేటాయించే దవాఖానలు బాధ్యత తీసుకుంటాయా? అన్న దానిపైనా స్పష్టత లేదు. ఒకవేళ పోస్టింగులు ఖరారు కాకపోతే.. హాజరు ఎకడ నమోదు చేయాలి? విధులు ఎకడ నిర్వహించాలి? అనే సందేహాలు వారిని వేధిస్తున్నాయి. సొంతశాఖనే వారికి పని చేసే స్థలాన్ని నిర్ణయించకపోవడంతో వారికి ఎకడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

