హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : వారంలోగా నార్లాపూర్ పంపులు ఆన్‌చేసి కల్వకుర్తి ఆయకట్టు రైతాంగానికి నీరందించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. ఆయకట్టు పరిధిలో ఎకరం ఎండిపోయినా ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చిచెప్పారు. నీటి విడుదలపై సర్కార్ నిర్లక్ష్యం వహిస్తే రైతులతో కలిసి ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.
గురువారం తెలంగాణ భవన్లో విలేకరులతో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. అసమర్థ సర్కార్ నిర్వాకంతోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ మూడోసారి వెనక్కివచ్చిందని ఆరోపించారు. 90 టీఎంసీలపై క్లారిటీ లేదని కేంద్ర జలశాఖ కుంటిసాకులు చెప్పడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కేసీఆర్ 2023 ఆగస్టు 10న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. చిన్న సంతకం మాత్రమే మిగిలిపోయిందని స్పష్టంచేశారు. కానీ, మూడేైండ్లెనా డీపీఆర్‌కు అనుమతులు సాధించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని పాలమూరు గడ్డపై మాటిచ్చిన ప్రధాని మోదీ, ఇప్పుడు మౌనం వహిస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. జాతీయ హోదా ఇవ్వకున్నా, తెలంగాణ సొంత నిధులతో కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టు నిర్మాణానికి ఉపక్రమించిందని గుర్తుచేశారు. కానీ, చేతగాని రేవంత్ ప్రభుత్వ తీరుతో పాలమూరు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని దుయ్యబట్టారు. జాతీయ హోదా ప్రకటించి నిధులు ఇవ్వకున్నా.. కనీసం అనుమతులైనా ఇవ్వరా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.
పాలమూరులో 45 టీఎంసీల కేటాయింపునకు సంబంధించి 1980లోనే బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని శ్రీనివాస్‌గౌడ్ ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టులో నాగార్జునసాగర్ ఎగువన 45 టీఎంసీలు వాడుకునే హక్కు తెలంగాణకు ఉన్నట్టు పేర్కొన్నదని తెలిపారు. నిజాం పాలన తర్వాత ధ్వంసమైన చెరువులను లెక్కకట్టి మరో 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్‌కు కేటాయించారని పేర్కొన్నారు. 90 టీఎంసీల లెక్కలపై పూర్తిస్పష్టత ఉన్నదని, అయితే బ్రజేశ్ ట్రిబ్యునల్ తీర్పు ఈ నెలలో వస్తుందని ఏపీకి తెలుసని, అందుకే పాలమూరు ప్రాజెక్టుకు అవరోధాలు సృష్టిస్తున్నదని ఆరోపించారు. బనకచర్ల కోసమే ఏపీ సర్కార్ దుష్టపన్నాగానికి దిగిందని మండిపడ్డారు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తుంటే రాష్ట్ర ఎంపీలు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.
కృష్ణా బేసిన్ నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి ఏపీ సీఎం చంద్రబాబు నీళ్లు తీసుకెళ్తుంటే, ఆయన శిష్యుడైన రేవంత్‌రెడ్డి గుడ్లప్పగించి చూస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. పెన్నా బేసిన్‌కు నీళ్లు.. మనకు కన్నీళ్లా? ఇదెక్కడి న్యాయం’ అని ధ్వజమెత్తారు. కర్ణాటక నుంచి ప్రతిరోజూ 5వేల క్యూసెక్కులు జూరాలకు విడుదల చేయిస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు.. పంటలు ఎండిన తర్వాత నీళ్లు తెస్తారా? అని ప్రశ్నించారు. కడపుమండి ఆందోళన చేసిన జూరాల రైతులపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమని మండిపడ్డారు. నాడు కేసీఆర్ గొప్ప ప్రాజెక్టులు కట్టారని పొగిడిన మంత్రి జూపల్లి, రేవంత్ సంకన చేరగానే ఊసరవెల్లి చందంగా మాట మార్చారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని త్వరలోనే ద్రోహులకు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.